దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న 'RRR' సినిమాలో ఒక హీరోగా ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ మార్కెట్ మరింత పెరుగుతుందనే విషయం క్లిస్టర్ క్లియర్. దీంతో దానికి అనుగుణంగా ఇప్పటినుండే ప్లాన్లు చేసుకుంటున్నాడు ఈ హీరో. 

ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయిన ఎన్టీఆర్ ఇకపై ఇతర భాషల్లో కూడా ప్రభావం చూపించే ప్రాజెక్ట్ లను ఎన్నుకుంటున్నాడు. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తదుపరి సినిమా ఉంటుందనే వార్త ప్రచారంలో ఉంది. దాదాపు ఈ కాంబో ఫిక్స్ అయినట్లేనని చెబుతున్నారు. 

ప్రశాంత్ నీల్ కి 'కేజిఎఫ్'తో ఎంతటి గుర్తింపు దక్కిందో తెలిసిందే. అతడితో కలిసి పని చేయడం మంచి నిర్ణయమనే చెప్పాలి. ఈ సినిమా ద్వారా సౌత్ తో పాటు నార్త్ లో కూడా తన ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ దొరుకుతుంది.

అలానే డైరెక్టర్ అట్లీతో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని టాక్. విజయ్ తో భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలు తీసిన అట్లీకి కమర్షియల్ గా ఎలాంటి సినిమాలు తీయాలో బాగా తెలుసు. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. అట్లీతో సినిమా చేస్తే తమిళంతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. మొత్తానికి 'RRR' తరువాత ఎన్టీఆర్ తన మార్కెట్ ని మరింత విస్తరించేలా ప్రాజెక్ట్ లు ప్లాన్ చేస్తున్నాడు.