ఈ మధ్య కాలంలో అందరి దృష్టిని ఆకర్షించింది 'కెజిఎఫ్' మూవీ. యష్ హీరోగా కన్నడ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా ట్యాగ్ తో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తెలుగు ప్రీరిలీజ్ ఫంక్షన్ కి రాజమౌళి స్వయంగా వచ్చారు. అంతేకాదు హీరో యష్ అలానే చిత్రబృందాన్ని పొగుడుతూ తెగ మాట్లాడారు. టాలీవుడ్ లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఇద్దరు హీరోలు ఇబ్బందిగా మారారు. వరుణ్ తేజ్ నటించిన 'అంతరిక్షం' అలానే శర్వానంద్ నటించిన 'పడి పడి లేచే మనసు' సినిమాలు కూడా ఈ నెల 21నే రానున్నాయి. యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్, దిల్ రాజు వంటి వారు ఈ రెండు సినిమాలను ఏపీ, తెలంగాణాలో విడుదల చేస్తుండడంతో మొత్తం థియేటర్లన్నీ కూడా ఆక్యుపై చేసేశారు.

దీంతో 'కెజిఎఫ్' సినిమాకి కావలసినన్ని థియేటర్లు దొరకలేదు. దీంతో 'కెజిఎఫ్' చిత్రబృందం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తెలుగులో సినిమా ప్రమోషన్స్ పై కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఓ పక్కన 'అంతరిక్షం', 'పడి పడి లేచే మనసు' సినిమాలు ప్రమోషన్స్ విషయంలో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఈ రెండు సినిమాల ముందు 'కెజిఎఫ్' ఎంతవరకు నిలుస్తుందో చూడాలి!