మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా' సినిమా మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తన తండ్రి కెరీర్ లో గొప్ప సినిమాగా ఈ చిత్రం మిగిలిపోవాలని రామ్ చరణ్ ఖర్చుకి వెనుకాడకుండా సినిమాను నిర్మించాడు. దాదాపు రూ.270 కోట్లను ఈ సినిమా కోసం ఖర్చు చేశారు. అయితే ఇందులో చిరంజీవి రెమ్యునరేషన్ లేదట.

కానీ సినిమా అంత రికవరీ చేస్తుందా..? అనే విషయంపై అనుమానాలు కలుగుతున్నాయి. సినిమాకి మార్కెట్ ఓ రేంజ్ లో జరిగినా.. నాన్ థియేటర్ హక్కుల ఆదాయం కలుపుకున్నా కేవలం బ్రేక్ ఈవెన్ అవుతుందేమోనని లెక్కలు కడుతున్నారు.

కానీ ఇప్పటివరకు నాన్ థియేటర్ హక్కుల డీల్ సెట్ కాలేదు. అది ఫైనల్ అయితేనే అన్నీ కలిపి రూ.270 కోట్లు రికవరీ వస్తుందో.. లేదో తెలుస్తుంది. అంత డబ్బు వెనక్కి వచ్చినా.. చిరంజీవి రెమ్యునరేషన్ అయితే ఉండదు. అంటే ఆయన తన ఫ్యామిలీ సినిమాలో ఫ్రీగా నటించినట్లే అనుకోవాలి. అయితే సినిమాకి డబ్బులు వచ్చినా.. రాకపోయినా తనకు అనవసరమని తన తండ్రికి మంచి సినిమాను గిఫ్ట్ గా ఇవ్వడమే తనకు ముఖ్యమని గతంలో చాలా సార్లు రామ్ చరణ్ చెప్పారు.

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.