ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డిపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం అక్టోబర్ 2న దక్షణాది భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. ఈ చిత్రంలో నయన్ ఫిమేల్ లీడ్ గా నరసింహారెడ్డి భార్య పాత్రలో నటించింది. 

ఇటీవల విడుదలైన ట్రైలర్ కు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ట్రైలర్ విడుదలైపోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఆదివారం జరగబోతున్న ప్రీరిలీజ్ ఈవెంట్ పై పడింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, సైరా చిత్ర యూనిట్, రాజమౌళి, పవన్ కళ్యాణ్ ఇలా అతిరథ మహారథులంతా హాజరవుతున్నారు. నయనతార కూడా హాజరైతే బావుంటుందనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. 

కానీ నయన్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడం అనుమానమే. సాధారణంగా నయన్ సినిమా ప్రచారంలో పాల్గొనదు. నటించడం వరకే తన పనిగా భావిస్తుంది. సినిమాకు సైన్ చేసే సమయంలోనే నిర్మాతలకు నయన్ ఈ విషయం చెప్పేస్తుంది. విజయ్ నటించిన బిగిల్ చిత్రంలో కూడా నయనతారే హీరోయిన్. ఈ చిత్ర ఆడియో వేడుక గురువారం జరిగింది. 

బిగిల్ ఆడియో వేడుకలో కూడా నయన్ కనిపించలేదు. దీనితో నయనతార సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడం అనుమానమే అని వార్తలు వస్తున్నాయి. నయన్ ని రప్పించేందుకు రాంచరణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.