తన పుట్టిన రోజుకు ముందు రోజు ఎన్టీఆర్‌ నటించిన జగదేకవీరుని కథ సినిమాలోని శివ శంకరీ పాటను స్వయంగా పాడి రిలీజ్ చేశాడు బాలకృష్ణ. అయితే ఈ పాట విషయంలో బాలయ్యపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వినిపించాయి.

నందమూరి నటసింహం బాలకృష్ణ 60వ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య కూడా అభిమానుల కోసం రెండు గిఫ్ట్ లు అందించాడు. పుట్టిన రోజుకు ముందు రోజు ఎన్టీఆర్‌ నటించిన జగదేకవీరుని కథ సినిమాలోని శివ శంకరీ పాటను స్వయంగా పాడి రిలీజ్ చేశాడు. అయితే ఈ పాట విషయంలో బాలయ్యపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వినిపించాయి.

క్లాసిక్‌గా నిలిచిపోయే పాటను బాలకృష్ణ పాడు చేశాడన్న విమర్శలు కూడా వినిపించాయి. వర్మ లాంటి వారు సెటైర్లు వేస్తే.. నాగబాబు లాంటి వారు సోషల్ మీడియా వేదిక కామెంట్లు చేసి తరువాత నాలిక్కరుచుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన నందమూరి బాలకృష్ణ తనపై వచ్చిన విమర్శలపై స్పందించాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `నాన్నగారు నాకు స్ఫూర్తి ప్రదాత. ఆయన నటించిన జగదేకవీరుని కథ సినిమాలోని శివ శంకరీ పాటంటే నాకు చాలా ఇష్టం.. ఆ పాట పాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎంతో సాధన చేసి కష్టపడి ఆ పాట పాడాను. నేను గొప్పగా పాడేశానని చెప్పటం లేదు. కానీ ఓ ప్రయత్నం చేశాను. నా శక్తి మేరకు ఆ పాట పాడను` అని చెప్పాడు బాలయ్య.

ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్‌ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. బాలయ్య హీరోగా సింహా, లెజెండ్‌ లాంటి బ్లాక్‌ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమాను చేస్తున్నాడు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నాడు.