మహిళా దర్శకురాలిగా నందిని రెడ్డి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. లేటెస్ట్ గా రిలీజైన ఓబీ బేబీ చిత్రంతో నందిని రెడ్డి ఖాతాలో మరో సూపర్ హిట్ చేరింది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంతని వైవిధ్యంగా చూపించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. విడుదల తర్వాత కూడా ఓ బేబీ ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందిని రెడ్డి పూరి జగన్నాథ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సినిమాలు చాలా ఆలస్యంగా తీస్తున్నాననే ప్రశ్నకు నందిని రెడ్డి స్పందించారు. నా కథలు, స్క్రీన్ ప్లే అన్ని నేనే సిద్ధం చేసుకోవాలి. హీరోల ఇమేజ్ తగ్గట్లుగా స్క్రిప్ట్ ఉండాలి. ఓ హీరో కోసం కథ రాసుకున్నాం అనుకో.. ఈ లోపు ఆ హీరో నటించిన సినిమాలు విడుదలై విజయం సాధిస్తే అతడి ఇమేజ్ మారిపోతుంది. 

దీనితో మరోమారు కథలో మార్పులు చేయాల్సి వస్తుంది. అందువల్లనే నా సినిమాలు ఆలస్యం అవుతున్నాయి అని నందిని రెడ్డి అన్నారు. కానీ తాను షూటింగ్ మాత్రం చాలా వేగంగా ఫినిష్ చేస్తాను అని నందిని రెడ్డి అన్నారు. నా ప్రతి చిత్రాన్ని 50 రోజుల లోపే పూర్తి చేశానని, ఓ బేబీ కూడా 50 వర్కింగ్ డేస్ లో కంప్లీట్ అయిపోయిందని నందిని రెడ్డి అన్నారు. 

షూటింగ్ వేగంగా ఫినిష్ చేయడం పూరి జగన్నాథ్ నుంచే నేర్చుకున్నట్లు నందిని రెడ్డి అన్నారు. ఆయన నిర్మాతలకు అనుకూలమైన దర్శకుడు. షూటింగ్, స్క్రిప్ట్ విషయంలో పూరి ప్లానింగ్ పక్కాగా ఉంటుంది. అందుకే పూరి జగన్నాథ్ సినిమాలు ఫ్లాప్ అయినా పెద్దగా లాస్ ఉండదని నందిని రెడ్డి అన్నారు. పూరి సత్తా అదే అని అన్నారు. ఆయనలా వేగంగా కథలు రాయడం కూడా నేర్చుకుంటానని అన్నారు.