Nagarjuna-Naga Chaitanya: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య లు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. పరువు నష్టం దావా కేసులో భాగంగా తమ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

Nagarjuna-Naga Chaitanya: తెలంగాణ మంత్రి కొండా సురేఖ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు కోర్టు వరకూ చేరాయి. ప్రముఖ సినీ కుటుంబం అక్కినేని వారు ఆమెపై పరువు నష్టం దావా వేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బుధవారం టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, ఆయన కుమారుడు నాగ చైతన్య నాంపల్లిలోని మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరైన వీరిద్దరూ తమ స్టేట్‌మెంట్లను న్యాయమూర్తి రికార్డ్ చేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం

గతంలో మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విమర్శలు చేస్తూ, నాగ చైతన్య–సమంత విడాకులపై సంచలన ఆరోపణలు చేశారు. అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఎన్ కన్వెన్షన్ భవనం కూల్చివేయకుండా ఉండేందుకు సమంతను కేటీఆర్ వద్దకు పంపేందుకు నాగార్జున, నాగ చైతన్య ఒత్తిడి చేశారని, సమంత నిరాకరించడం వల్లే విడాకులు జరిగాయని ఆమె వ్యాఖ్యలు పెద్ద వివాదాన్నే రేపాయి. ఈ ఆరోపణలు వ్యక్తిగత జీవితం, కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని అక్కినేని కుటుంబం మండిపడింది.

నాగార్జున ఫైర్ 

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున బహిరంగంగానే కాకుండా కోర్టులోనూ తీవ్రంగా స్పందించారు. “బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు జాగ్రత్తగా మాట్లాడాలి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దు. మా కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు అసత్యం, అసంబద్ధం. వెంటనే వెనక్కి తీసుకోవాలి”అని నాగార్జున స్పష్టం చేశారు. నాగార్జునతో పాటు అమల, నాగ చైతన్య, అఖిల్ కూడా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కోర్టులో దాఖలైన ఆధారాలు

సురేఖ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్స్, సోషల్ మీడియా లింక్స్‌ను ఆధారాలుగా సమర్పించారు. తమ పరువుకు, ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు కలిగేలా చేయడం తమ కుటుంబానికి తీవ్రంగా దెబ్బతీసిందని నాగార్జున విన్నవించారు. ఈ కేసులో ఇప్పటికే అక్కినేని కుటుంబ సభ్యులు, మంత్రి కొండా సురేఖ కూడా నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. గత కొన్ని నెలలుగా ఈ దావా పై విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా నాగార్జున, నాగ చైతన్య మరోసారి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. కోర్టు వీరి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసి విచారణను వాయిదా వేసింది.