ఓటీటీలున్నాయి, థియేటర్‌తో సంబంధం లేదు, సినిమాలు తీసేయోచ్చని చాలా మంది నిర్మాతలు భావిస్తారు.  చిన్న సినిమాలు తీయాలనుకునే నిర్మాతలకు `మిస్టర్ ప్రెగ్నెంట్‌` నిర్మాత హెచ్చరిక చేశారు.

ఓటీటీలున్నాయి, థియేటర్‌తో సంబంధం లేదు, సినిమాలు తీసేయోచ్చని చాలా మంది నిర్మాతలు భావిస్తారు. ముఖ్యంగా చిన్న సినిమాలు తీయాలనుకునే నిర్మాతలకు ఒక హెచ్చరిక. థియేటర్ ని నమ్ముకుని, కంటెంట్‌ని నమ్ముకుని మాత్రమే సినిమాలు తీయాలని, ఓటీటీలను నమ్ముకుని సినిమా తీస్తే ఇబ్బందులు తప్పవని తెలిపారు నిర్మాత అప్పిరెడ్డి. ఒకప్పుడు ఓటీటీలు ఏవైనా సినిమాలు కొనేవని, కానీ ఇప్పుడు థియేటర్లో రిలీజ్‌ అయి ఆడితేనే కొంటున్నాయని, అది కూడా మంచి కంటెంట్‌ అయితేనే తీసుకుంటున్నాయని, ఒకవేళ ఓటీటీలు కొనకపోతే సినిమాల పరిస్థితి ఏంటని? అందుకే థియేటర్లలో రిలీజ్‌ చేయగలిగే సత్తా ఉన్న నిర్మాతలే సినిమాలు తీయాలని, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలని తెలిపారు అప్పిరెడ్డి. 

ఆయన ఇప్పుడు బిగ్‌ బాస్ ఫేమ్‌ సోహైల్‌ హీరోగా `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌` అనే చిత్రాన్ని వెంకట్‌రెడ్డి అన్నపరెడ్డి, రవీందర్‌రెడ్డి సజ్జలతో కలిసి నిర్మించారు. రూపా కొడవాయుర్ హీరోయిన్‌. శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తన తోటి నిర్మాతలతో కలిసి ఆయన మంగళవారం ముచ్చటించారు. `మిస్టర్ ప్రెగ్నెంట్` సినిమాని కొత్తదనం ఉన్న స్క్రిప్ట్ ను నమ్మే నిర్మించాం. ఈ కథలో మదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది. మేల్ పెగ్నెన్సీ నేపథ్యం కాబట్టి ఇండస్ట్రీలో కొందరు స్నేహితులు ఇది కత్తి మీద సాము లాంటి సినిమా అని చెప్పారు. ఇది ఛాలెంజింగ్ స్క్రిప్ట్. మేము కూడా అలాగే తీసుకుని చేశాం. ఔట్ పుట్ మేము ఎక్స్ పెక్ట్ చేసినట్లే వచ్చింది. 

ఇటీవల మైత్రి డిస్ట్రిబ్యూషన్ వాళ్లు చూశారు. సినిమా చాలా బాగుందని చెప్పారు. దాంతో మా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ మా సినిమాకు ఆకర్షణ అవుతుంది. మా సంస్థలో పెద్ద హీరోలతోనూ సినిమాలు చేయాలని ఉంది. కానీ వాళ్లంతా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. వాస్తవానికి వాళ్లను ఒక స్క్రిప్ట్ తో అప్రోచ్ అవడమే కష్టం. వాళ్లకు నచ్చినా రెండు మూడేళ్లు వెయిట్ చేయాలి. మన దగ్గర నచ్చిన స్క్రిప్ట్ ఉన్నప్పుడు వెయిట్ చేయడం ఎందుకనిపిస్తుంటుంది. ఎక్కువ టైమ్ వెయిట్ చేస్తే అప్పుడు అనుకున్న స్క్రిప్ట్ కూడా ఔట్ డేటెడ్ అయ్యే అవకాశాలుంటాయి. కానీ మాకు అన్నీ కుదిరితే తప్పకుండా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తాం` అని చెప్పారు.

నిర్మాత వెంకట్ అన్నపరెడ్డి మాట్లాడుతూ, మా సంస్థలో ఇప్పటిదాకా నాలుగు సినిమాల్ని సక్సెస్ ఫుల్ గా రిలీజ్ చేశాం. మంచి కథల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అయితే కథ విన్నప్పుడు ఒక బడ్జెట్ ఉంటుంది. మేకింగ్ పూర్తయ్యేసరికి ఇంకో నెంబర్ కు వెళ్తుంది. ఇది మెయిన్ ప్రాబ్లమ్ గా భావిస్తున్నాం. దాన్ని ఓవర్ కమ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ముందుగా‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు వేరే హీరోల్ని అనుకున్నాం. అయితే బిగ్ బాస్ చూసినప్పుడు ఆ గేమ్స్ లోని ఎమోషన్ ను సొహైల్ ఇంప్రెసివ్ గా చూపించాడు. అప్పుడే అనుకున్నాం ఈ కథకు హీరోగా బాగుంటాడని. అతనికి ఈ సినిమాలో మంచి పేరొస్తుంది. మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ ను ఎంతో సహజంగా చేశాడు. ఈ సినిమాను కమర్షియల్ మూవీ ఫార్మేట్ లో చూడకూడదు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చూశాక చాలా మంది తమ ఎక్సీపిరియన్స్ మాతో షేర్ చేసుకున్నారు. మా వైఫ్ ను ప్రెగ్నెంట్ టైమ్ లో ఇంకా బాగా చూసుకుని ఉండాల్సింది అన్నారు. అలా ఎవరికి వారిని వ్యక్తిగతంగా ఆలోచింపజేసే చిత్రమవుతుంది` అని చెప్పారు.

నిర్మాత రవీందర్ రెడ్డి సజ్జల మాట్లాడుతూ - మా బ్యానర్ లో ముగ్గురం నిర్మాతలం కలిసే సినిమాలు చేస్తున్నాం. మా మధ్య డిఫరెన్సెస్ ఎప్పుడూ రావు. మా వర్క్ లో ఎవరైనా కరెక్షన్స్ చెబితే చెక్ చేసుకుంటాం. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా ట్రైలర్ ను నాగార్జున గారు విడుదల చేయడంతో మంచి బూస్టింగ్ వచ్చింది. అలాగే ఆయన ఆ కార్యక్రమంలో ట్రైలర్ ను మరోసారి చూశారు. ట్రైలర్ కు రెస్పాన్స్ బాగుండటంతో మూవీ మీద బజ్ ఏర్పడింది. ఇలాంటి కథతో తెలుగులో మూవీ రాలేదు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ యూనిక్ గా ఉంటుంది. ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో సినిమాను ఎంజాయ్ చేస్తారు` అన్నారు.