సూపర్ స్టార్ రజినీకాంత్ పాలిటిక్స్ లోకి రావడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేయగా, ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏళ్ల తరబడి ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఆరోగ్య కారణాల రీత్యా, దేవుని ఆదేశం మేరకు పాలిటిక్స్ లోకి రాకూడని నిర్ణయం తీసుకున్నట్లు రజినీకాంత్ ఫ్యాన్స్ కి తెలియజేశారు. రజినీకాంత్ నిర్ణయం తమిళ రాజకీయాలలో పెద్ద చర్చకు దారితీసింది. కాగా విలక్షణ నటుడు మోహన్ బాబు, రజినీకాంత్ నిర్ణయంపై తనదైన శైలిలో స్పందించారు. 

పాలిటిక్స్ వద్దనుకున్న రజినీ నిర్ణయం అందరినీ బాధకు గురిచేసినా తనను, సంతోషపెట్టిందని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో మోహన్ బాబు ఓ సుదీర్ఘ సందేశం పంచుకున్నారు. రజినీకాంత్ కి అత్యంత సన్నిహితుడిగా, ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా తెలిసిన వాడిగా రజినీకాంత్ నిర్ణయం నన్ను ఆనందానికి గురి చేసింది అన్నారు. చీమకు కూడా హాని చేయని నీకు రాజకీయాలు సరిపడవు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మన లక్షణం.. మనం డబ్బులు ఇచ్చి ఓట్లు కొనలేము, అలా చేయలేము, కాబట్టి రాజకీయాలు నీకు సరిపడవు అని నా మిత్రుడు రజినీకాంత్ తో చెప్పాను అన్నారు. 

రాజకీయాలు ఒక రొచ్చు, బురద.. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియదు. ఎవరిని నమ్మాలో తెలియదు, ఇప్పుడు పొగిడినవారు రేపు విమర్శలు చేస్తారు. కాబట్టి రజినీకాంత్ రాజకీయాలనుండి తప్పుకోవడమే మంచిది, ఆయన నిర్ణయాన్ని నేను సమర్ధిస్తున్నానని తేల్చిచెప్పారు. రజినీకాంత్ రాజకీయాలకు వెనుకడుగు వేయడం వెనుక చిరంజీవి, మోహన్ బాబు హస్తం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తిరేపుతోంది.