ఈ శుక్రవారం ప్రధానంగా నాలుగు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అందులో నరేష్‌,పవిత్ర లోకేష్‌ల `మళ్ళీ పెళ్ళి`,  `మేమ్‌ ఫేమస్‌` ,`మెన్‌ టూ`, అలాగే మలయాళ సంచలన చిత్రం `2018` ఉంది. వీటిలో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?

సమ్మర్‌ అంటే పెద్ద సినిమాల హడావుడి ఉంటుంది. ఎప్పుడైనా వారానికో పెద్ద సినిమా అయినా ఉండేది. కానీ ఈ ఏడాది అంతా రివర్స్ అయ్యింది. ఉన్న కొన్ని సినిమాలు బోల్తా కొట్టాయి. దీంతో చిన్న సినిమాల హవా సాగుతుంది. అవి కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోతున్నాయి. ఒకప్పుడు చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య వచ్చేది. ఇప్పుడు థియేటర్లు ఖాళీగా ఉన్న సినిమాలు లేవు. దీంతో ఉన్న ఒకటి రెండు సినిమాలతోనే నెట్టుకొస్తున్నారు. 

ఇక ఈశుక్రవారం ప్రధానంగా చెప్పుకోదగ్గవి నాలుగు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అందులో నరేష్‌,పవిత్ర లోకేష్‌ల `మళ్ళీ పెళ్ళి`, కొత్త కుర్రాడు సుమంత్‌ ప్రభాస్‌ చేసిన `మేమ్‌ ఫేమస్‌` తోపాటు `మెన్‌ టూ`, అలాగే మలయాళ సంచలన చిత్రం `2018` రిలీజ్‌ అయ్యాయి. వీటిలో ఏ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి? అనేది ఓ సారి చూస్తే..

ఇందులో టాప్‌లో కొత్త కుర్రాళ్ళు చేసిన `మేమ్‌ ఫేమస్‌` మూవీ ఉంది. ఇది తొలి రోజు వరల్డ్ వైడ్‌గా కోటీ పదిలక్షల గ్రాస్‌ వసూలు చేసింది. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేని కుర్రాడు సుమంత్‌ ప్రభాస్‌ తనే హీరోగా, దర్శకుడిగా మారి చేసిన చిత్రమిది. ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలి రోజు తన సత్తాని చాటింది. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యిందీ సినిమా. ముఖ్యంగా తెలంగాణ పల్లెటూరి కుర్రాళ్లకి మరింతగా కనెక్ట్ అవుతుంది. చాలా వరకు వారి రియల్‌ లైఫ్‌ని చూసుకున్న ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే మేకింగ్‌ పరంగా, టెక్నికల్‌గా ఇంకా బాగా చేసి ఉంటే ఈ సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లేది. 

రెండో స్థానంలో మలయాళ బ్లాక్ బస్టర్‌ `2018` మూవీ ఉంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలు వసూలు చేసింది. ఓ రకంగా ఇది `మేమ్‌ ఫేమస్‌`(వరల్డ్ వైడ్‌ కలెక్షన్ల) కంటే ఎక్కువే అని చెప్పాలి. పెద్దగా పబ్లిసిటీ లేని ఈ చిత్రానికి ఈ రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయంటే అభినందించాల్సిన విషయమే. అయితే ఇప్పటికే మలయాళంలో, ఇతర భాషల్లో విడుదలై సంచలనం సృష్టిస్తుంది. 150కోట్లు దాటింది. మాలీవుడ్‌ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్‌ చేసి సంచలనం సృష్టిస్తుందీ సినిమా. దీనికి జుడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వం వహించగా, టొనివో థామస్‌, తన్వి రామ్‌, అసిఫ్‌ అలీ, వినీత్‌ శ్రీనివాసన్‌, అపర్ణ బాలమురళి, బొబన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. 

శుక్రవారం విడుదలైన సినిమాల్లో మోస్ట్ హాట్‌ అండ్‌ బోల్డ్ కపుల్‌ నటించిన `మళ్ళీ పెళ్ళి` కూడా ఉంది. నరేష్‌, పవిత్రల సహజీవనం మ్యాటర్‌ చాలా కాలంగా వార్తల్లో నిలుస్తుంది. వివాదాలకు కేరాఫ్‌గానూ నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమా కావడంతో, పైగా తమ లైఫ్‌నే సినిమాగా తీయడంతో దీనిపై సినీ జనాల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో ఏం చెప్పబోతున్నారనే ఇంట్రెస్ట్ అందరిలోనూ ఉంది. మరి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. ఈ సినిమాకి తొలి రోజు వరల్డ్ వైడ్‌గా కేవలం 40లక్షల గ్రాస్‌ మాత్రమే వచ్చాయి. అంటే 25 నుంచి 30 లక్షల నెట్‌ ఉంటుంది. బడ్జెట్‌ పరంగా అన్నింటికంటే ఎక్కువే పెట్టాడు నరేష్‌. కానీ సినిమాని జనరల్‌ ఆడియెన్స్ పట్టించుకోలేదు. 

వీటితోపాటు బ్రహ్మాజీ, ఆగస్త్య నరేష్‌, వైవా హర్ష, సుదర్శన్‌ వంటివారు కలిసి నటించిన `#మెన్‌టూ` చిత్రం కూడా శుక్రవారం రిలీజ్‌ అయ్యింది. మగవాళ్ల కష్టాల నేపథ్యంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కూడా ఆడియెన్స్ పట్టించుకోలేదు. ఇది కూడా దారుణమైన ఫలితాన్ని చవిచూసింది.