మాలీవుడ్‌లో విషాదం నెలకొంది. యంగ్‌ స్టార్‌ హీరో, `ప్రేమమ్‌` ఫేమ్‌ నివిన్‌ పాలీ పర్సనల్‌ మేకప్‌మెన్‌ షాబు పుల్పల్లి  కన్నుమూశారు. ప్రమాదవశాత్తు ఆయన చెట్టుపై నుంచి పడి ఆదివారం దుర్మరణం చెందారు. క్రిస్మస్‌ స్టార్‌ని వేలాడదీసేందుకు చెట్టు ఎక్కిన అకస్మాత్తుగా అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, మధ్యలోనే ఆయన తుది శ్వాస విడిచినట్టు ఫిల్మ్ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఫెఫ్కా) డైరెక్టర్స్ యూనియన్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ప్రకటించింది. 

షాబు హఠాన్మరణంతో మాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తన సొంత మేకప్‌మేన్‌ మరణంతో హీరో నివిన్‌ పాలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. `బెంగుళూరు డేస్‌`, `విక్రమాదిత్యన్‌` చిత్రాలకు షాబు పనిచేశాడని నివిన్‌ పేర్కొంటూ తన తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయనతోపాటు ఉన్ని ముకుందన్‌, దర్శకుడు బోబన్‌ శామ్యూల్‌, మలయాళ మూవీ అండ్‌ మ్యూజిక్‌ డేటాబేస్‌ కూడా సంతాపాన్ని తెలిపారు. అనేక మంది మలయాళ సినీ ప్రముఖులు మేకప్‌మేన్‌ మరణంలో విచారాన్ని వ్యక్తం చేశారు. 

2012లో `పుతియా తీరంగల్‌` చిత్రంతో షాబు మేకప్‌మేన్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారట. మొదటి నుంచి నివిన్‌తోనే పనిచేసినట్టు తెలుస్తుంది. షాబు ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్ షాజీ పుల్పల్లి సోదరుడు. షాబుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.