Asianet News TeluguAsianet News Telugu

మలయాళ దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్‌ కన్నుమూత.. నాకు లైఫ్‌ ఇచ్చారంటూ మోహన్‌లాల్‌ ఆవేదన

ప్రముఖ మలయాళ దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్‌ డెన్నీస్‌ జోసెఫ్‌ కన్నుమూశారు.  గుండెపోటు కారణంగా ఆయన సోమవారం రాత్రి మరణించినట్టు మలయాళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

malayala script writer director dennis joseph passed away mohanlal condolence  arj
Author
Hyderabad, First Published May 11, 2021, 9:29 AM IST

ప్రముఖ మలయాళ దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్‌ డెన్నీస్‌ జోసెఫ్‌ కన్నుమూశారు.  గుండెపోటు కారణంగా ఆయన సోమవారం రాత్రి మరణించినట్టు మలయాళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మలయాళ సూపర్‌ స్టార్స్ మోహన్‌లాల్‌, మమ్ముట్టి వంటి బిగ్‌ స్టార్స్ తో సినిమాలు రూపొందించి, వారి సినిమాలకు పనిచేసి అగ్ర దర్శకుడిగా, స్క్రిప్ట్ రైటర్‌గా పేరుతెచ్చుకున్నారు డెన్నీస్‌ జోసెఫ్‌.

జోసెఫ్‌ 1980లో తన కెరీర్‌ని ప్రారంభించారు. ఓ మ్యాగజీన్‌కి జర్నలిస్ట్ గా ఆయన జీవితం ప్రారంభమైంది. అట్నుంచి స్క్రిప్ట్ రైటర్‌గా మారారు. ఇలా దాదాపు 45 చిత్రాలకు ఆయన స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. ఓ ఐదు సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో సూపర్‌ హిట్‌ చిత్రం `మను అంకుల్‌` ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి బెస్ట్ చిల్డ్రన్‌ చిత్రంగా 1988లో జాతీయ అవార్డు రావడం విశేషం. 

మలయాళం ఆల్‌టైమ్‌ హిట్స్ `న్యూ ఢిల్లీ` కి జోసెఫ్‌ స్క్రిప్ట్ రైటర్‌. 1987లో వచ్చిన ఈ సినిమా మమ్ముట్టి కెరీర్ కొత్త లైఫ్‌ని ఇచ్చింది. మోహన్‌లాల్‌ హీరోగా రూపొందిన బ్లాక్‌బస్టర్‌ `రాజవింతే మఖన్‌` చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. అలాగే మమ్ముట్టి, మోహన్‌లాల్‌ కలిసి నటించిన `నెం20 మద్రాస్‌ మెయిల్‌` చిత్రాలకు పనిచేశారు. 

 జోసెఫ్‌ స్క్రిప్ట్ రైటర్‌గా ప్రముఖ అగ్ర దర్శకులు ప్రియదర్శన్‌ వద్ద పనిచేశారు. ఆయన రూపొందించిన `గీతాంజలి`కి కూడా పనిచేశారు. ప్రస్తుతం మరో స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందట. ఆ సినిమాని త్వరలో పట్టాలెక్కించాలని భావించారు. కానీ ఇంతలోనే ఆయన గుండెపోటుతో మరణించడం అత్యంత బాధాకరం. సోమవారం రాత్రి తన ఇంటి వద్దే ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి వెళ్లేలోపే ఆయన మార్గమధ్యంలో కన్నుమూసినట్టు వైద్యులు నిర్ధారించారు.

జోసెఫ్‌ మృతి పట్ల మోహన్‌లాల్‌ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. `నన్ను ఇలా తయారు చేసింది అతనే` అని పేర్కొన్నారు. ఆయన మరణం మలయాళ చిత్ర పరిశ్రమకి తీరని లోటని, ఆయన లేరనే వార్త కలచివేస్తుందని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే మమ్ముట్టి, సురేష్‌ గోపీ వంటి ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios