మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్  వర్క్ జరుగుతుంది. తాజాగా షూటింగ్‌ కి సంబంధించిన అప్‌డేట్‌ బయటకు వచ్చింది. 

రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తుంది. కానీ ఆస్కార్‌ అవార్డు సాధించే వరకు విశ్రమించలేదు జక్కన్న. భారతీయులకు కలగా ఉన్న ఆస్కార్ ని సాధించి పెట్టాడు. ఇప్పుడు ఆయన నెక్ట్స్ సినిమాపై ఫోకస్‌ పెట్టాడు. సూపర్‌ స్టార్‌ మహేష్‌తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. విజయేంద్రప్రసాద్‌ టీమ్‌ దీనిపై వర్క్ చేస్తుంది. 

ఇదిలా ఉంటే స్క్రిప్ట్ ఫైనల్‌ కావడానికి ఇంకా ఐదారు నెలలు పడుతుందని అంటున్నారు. కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ అంతకంటే ముందే ప్రారంభం కానుందట. మార్చిలోనే సినిమాని ప్రారంభించాలనుకుంటున్నారట. పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్‌ చేసి కొంత గ్యాప్‌తో సెట్స్ పైకి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. 

ఆఫ్రికా ఫారెస్ట్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ సాగనుందట. ఇందులో మహేష్‌బాబు ఓ సాహసికుడి పాత్రని పోషిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ స్టోరీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది. దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ రాసిన పుస్తకాల ఆధారంగా మహేష్‌బాబు సినిమా కథ ఉంటుందని, వాటి స్ఫూర్తితో ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నట్టు గతంలో విజయేంద్రప్రసాద్‌ తెలిపారు. 

ఇక ఇందులో నేషనల్‌, గ్లోబల్‌ ఆర్టిస్ట్ లు ఉండబోతున్నారట. హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆల్‌రెడీ దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. అయితే వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి రాజమౌళి సినిమా కోసం మహేష్‌బాబు ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు `గుంటూరు కారం` చిత్రంలో నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ రూపొందించే ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా చేస్తుంది. హారికా అండ్‌ హాసిని నిర్మిస్తుంది.