మహేష్‌ హీరోగా `అర్జున్‌రెడ్డి` దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఓ సినిమా చేయాల్సింది. వీరి కాంబినేషన్‌లో సినిమాకి సంబంధించిన  చర్చలు చాలా జరిగాయి. దాదాపు కన్ఫమ్‌ అనే వార్తలు వినిపించాయి. కానీ ఆ సినిమా వర్కౌట్‌ కాలేదు. దీంతో సందీప్‌ హిందీలో `అర్జున్‌రెడ్డి` రీమేక్‌ `కబీర్‌ సింగ్‌` తీసి హిట్‌ కొట్టాడు. ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌తో `యానిమల్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

కానీ మహేష్‌ని మాత్రం సందీప్‌ వదల్లేదు. ఎట్టకేలకు ఆయన్ని డైరెక్ట్‌ చేసే ఛాన్స్ ని కొట్టేశాడు. కాకపోతే అది సినిమా కాదు. ఓ యాడ్‌ షూటింగ్‌ విషయంలో. హవేల్స్ కంపెనీకి చెందిన యాడ్‌ ని మహేష్‌, తమన్నాలపై సందీప్‌రెడ్డి వంగా షూట్‌ చేశారు. ఇది తాజాగా పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్వహకులు ఈ ఫోటోలను పంచుకున్నారు. ఇందులో మహేష్‌ మరింత క్యూట్‌గా కనిపిస్తున్నారు. `ఆగడు` సినిమా తర్వాత మహేష్‌, తమన్నా కలిసి నటించడం ఈ యాడ్‌లోనే కావడం విశేషం. మహేష్‌ తానునటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్ర షూటింగ్‌ దుబాయ్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని వచ్చారు. ఈ గ్యాప్‌లో ఈ యాడ్‌ చేశాడు మహేష్‌.

ఇదిలా ఉంటే మహేష్‌ నెక్ట్స్ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం ఆయన పరశురామ్‌ డైరెక్షన్‌లో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. కీర్తిసురేష్‌ కథానాయిక. దీని తర్వాతి సినిమా ఏంటనేది మహేష్‌ ఇంకా ప్రకటించలేదు. కానీ రాజమౌళితో సినిమా ఉంటుందని టాక్‌. రాజమౌళి ఇప్పటికే తన నెక్ట్స్ సినిమా మహేష్‌తో అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాజమౌళి `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఉన్నారు. ఈ సినిమా నుంచి ఆయన రిలీఫ్‌ కావడానికి ఈ ఏడాది పడుతుంది. అలాగే మహేష్‌ సినిమాకి సంబంధించిన కథ రెడీ చేయడానికి మరికొంత కాలం పడుతుంది. 

ఈ నేపథ్యంలో ఇంతలో మరో సినిమా చేయాలని మహేష్‌ నిర్ణయించుకున్నారట. అంతేకాదు సినిమాల విషయంలో స్పీడ్‌ పెంచినట్టు తెలుస్తుంది. `సర్కారు వారి పాట` చిత్ర షూటింగ్‌ని వీలైనంత త్వరగా పూర్తి చేసి,  ఈ గ్యాప్‌లో మరో సినిమా చేసేందుకు మహేష్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడట. ఇప్పటికే దానికి సంబంధించిన కథ కూడా ఓకే అయ్యిందని తెలుస్తుంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఉందని టాక్‌. పాన్‌ ఇండియన్‌ చిత్రంగా దీన్ని రూపొందించబోతున్నారని, అయితే దర్శకుడు ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మొత్తానికి ఇతర హీరోల మాదిరి తాను కూడా వేగంగా సినిమాలు చేయాలని మహేష్‌ గట్టిగానే ఫిక్స్ అయినట్టు టాలీవుడ్‌ టాక్‌.