ఈ బయోపిక్ కోసం మొదట మహేష్ బాబుని అడిగారని సమాచారం. ఆయన వరస ప్రాజెక్టుల బిజిలో ఉండటంతో నో చెప్పారని తెలుస్తోంది. కానీ చేస్తే బాగుండేదని ఆయన అభిమానులు అంటున్నారు.
సూర్య ప్రధాన పాత్రలో చేసిన ఆకాశమే నీ హద్దురా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఈ చిత్రానికి సుధా కొంగర కథనంతో పాటు సూర్య నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇదే చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో సుధా కొంగర తెరకెక్కించారు. ఆ సినిమాతో విమర్శకులతో పాటు సినీజనం ప్రశంసలు అందుకున్న లేడీ డైరెక్టర్ సుధ కొంగర మరో క్రేజీ ప్రాజెక్టును చేపడుతోంది. అయితే ఈ సారి మరో బయోపిక్ చేయబోతోందని సమాచారం. ఇంతకీ ఎవరిదా బయోపిక్ ..ఏమిటా సంగతి అనేది చూస్తే...
ఆకాశమే నీ హద్దురా అనే సినిమా ఎయిర్ డెక్కర్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించారు. ఆ కథను స్ఫూర్తిగా తీసుకుని దానికి కొంచెం సినిమాటిక్ డ్రామా జోడించి సినిమాను రక్తి కట్టించారు. తమిళంలో సూరారై పోట్రుగా వచ్చిన ఈ సినిమాను స్వయంగా సూర్య నిర్మించాడు. సూర్య సొంత ప్రొడక్షన్ హౌస్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు గునీత్ మోంగా కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఆమెకు ఆఫర్లు వరసపెట్టి వచ్చాయి. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఆమెకు పిలిచి ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించి ఇప్పుడీ బయోపిక్ పనిలో పడింది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, సుధా కొంగరకు భారతీయ లెజెండరీ వ్యాపారవేత్త రతన్ టాటా బయోపిక్ లో పని చేసే అవకాశం వచ్చింది. సుధా కొంగర మొత్తం రీసెర్చ్ పూర్తి చేసి స్క్రిప్ట్ వర్క్ చేయడం మొదలుపెట్టారు. రతన్ టాటా పాత్రను సూర్య లేదా అభిషేక్ బచ్చన్ తిరిగి చేస్తారని సమాచారం. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత సుధా కొంగర మరియు ఆమె బృందం ప్రాజెక్ట్ గురించి వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. అలాగే మరో ప్రక్క ఈ బయోపిక్ కోసం మొదట మహేష్ బాబుని అనుకున్నారని సమాచారం. అయితే మహేష్ బాబు వరస ప్రాజెక్టులతో ఉండటంతో కష్టమవుతుందని నో చెప్పినట్లు చెప్తున్నారు. దాంతో అభిషేక్ ని సీన్ లోకి తెచ్చారంటున్నారు. వాస్తవానికి ఇప్పటిదాకా మహేష్ బాబు ..ఏ బయోపిక్ లోనూ చేయలేదు..కానీ రతన్ టాటా అనే సరికి ఉత్సాహం చూపించినా ..డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక నో చెప్పారని వినికిడి.
సుధా కొంగర 2016 లో “సాలె ఖడూస్” చిత్రం ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం తమిళంలో “ఇరుది సుత్రు” గా విడుదల అయింది. ఈ చిత్రం ద్వారా తమిళంలో ఉత్తమ ఫిలింఫేర్ డైరక్టర్ అవార్డు గెలుచుకున్నారు. 2017 లో గురు చిత్రం ద్వారా ఆమె తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసారు. ప్రస్తుతం పావ కథైగల్ అనే వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నారు.
