Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకు `మా`లో చలనం.. సెప్టెంబర్‌లో ఎన్నికలు?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా)లో ఎట్టకేలకు చలనం వచ్చినట్టుంది. దీనిపై మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ(ఈసీ) త్వరలో మీటింగ్‌ నిర్వహించబోతుంది. 

maa elections will conduct in september e c plan ?  arj
Author
Hyderabad, First Published Jul 25, 2021, 7:40 AM IST

`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఇందులో ఉండేది తొమ్మిది వందల మందే కానీ, ఇటీవల ఈ `మా` ఎన్నికల వివాదం రెండు రాష్ట్రాలను షేక్‌ చేసింది. సర్వత్రా హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్నికల షెడ్యూల్‌ రానేలేదు అప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ పోటీదారులు తాము పోటీలో ఉన్నట్టు ప్రకటిస్తూ `మా`పై చర్చకి తెరలేపారు. ఈ క్రమంలో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే వివాదాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ వాదం తెరపైకి వచ్చింది. `మా`కి బిల్డింగ్‌ హైలైట్‌ అయ్యింది. ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవిత, హేమ, సీఎల్‌వీ నర్సింహరావు అధ్యక్షుడి పీఠం కోసం పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. 

అయితే మరోవైపు ప్రకాష్‌ రాజ్‌ ఏకంగా తన ప్యానెల్‌ని ప్రకటించడంతోపాటు ప్రెస్‌మీట్‌ పెట్టి `మా`వివాదాన్ని మరింత పెంచేశారు. ఆ తర్వాత మంచు విష్ణు స్థానిక అనే విషయాన్ని పరోక్షంగా చెప్పారు. `మా` బిల్డింగ్‌ని తన సొంత ఖర్చులతో నిర్మిస్తాని అని హామీ ఇచ్చాడు. ఏకగ్రీవం చేస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఇక ఈ `మా`ఎన్నికల వేడిని బాలకృష్ణ మరింత పెంచారు. గతంలో `మా` బిల్డింగ్‌ కోసం ఫండ్‌ రైజింగ్‌ చేశారు. అమెరికాలో షోస్‌ చేశారు. ఆ డబ్బు ఏమైందని, `మా`లో అవినీతి జరిగిందనే వార్తలకు ఊతం ఇచ్చారు. 

ఈ క్రమంలో ఎట్టకేలకు `మా`లో చలనం వచ్చినట్టుంది. దీనిపై మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ(ఈసీ) త్వరలో మీటింగ్‌ నిర్వహించబోతుంది. ఈ బుధవారం గానీ, లేక గురువారంగానీ మీటింగ్‌ నిర్వహించనుందట. ఈ సారి ఈసీ మీటింగ్‌ వర్చువల్‌ గా నిర్వహించబోతున్నారు. ఏజీఎంను ఎప్పుడు నిర్వహించాలి? ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలి? సభ్యుల జీవిత బీమాకు చెల్లించాల్సిన ప్రీమియం.. కొందరికి జీవిత సభ్యత్వాలను ఇవ్వటం వంటి అంశాలపై ఈసీలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. 

ఈ సమావేశంలో ఈసీ సభ్యులతో పాటుగా క్రమశిక్షణా సంఘ ఛైర్మన్‌ కృష్ణంరాజు, న్యాయసలహాదారు, ఆడిటర్‌లు కూడా పాల్గొంటారు. `మా`ను ఏర్పాటు చేసిన తర్వాత వర్చువల్‌గా ఈసీ మీటింగ్‌ జరగటం ఇదే తొలిసారి. `మా` బైలాస్‌ ప్రకారం ఈసీ సమావేశానికి, సర్వసభ్య సమావేశానికి (ఏజీఎం) మధ్య 21 రోజుల వ్యవధి ఉండాలి. దీని ప్రకారం చూస్తే ఆగస్టు మూడోవారంలో ఏజీఎం జరిగే అవకాశముంది. `మా` కొత్త కార్యవర్గం కోసం సెప్టెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.  అయితే కరోనా నిబంధనలు తొలగిస్తే కానీ ఎన్నికలను నిర్వహించలేమని ప్రస్తుత కార్యవర్గం పేర్కొంది. అయితే కోవిడ్‌ మూడో వేవ్‌ రాకపోతే – ఎన్నికలను సెప్టెంబర్‌లోనే నిర్వహించే అవకాశముంది. 

Follow Us:
Download App:
  • android
  • ios