బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కు వివాదాలకు కొత్తేమీ కాదు. ఈసారి, ఆయన ఉత్తరప్రదేశ్ .. లోని ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జార్‌నుంచి పోలీస్ కంప్లైంట్ ఎదుర్కొన్నారు. అమీర్ ఖాన్ ఘజియాబాద్ లోనిలోని ట్రోనికా సిటీకు షూటింగ్ కోసం వచ్చినప్పుడు కోవిడ్-19 ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు పోలీసు ఫిర్యాదు నమోదు చేశారు. అమీర్‌ఖాన్ ఎపిడెమిక్‌ యాక్ట్ నిబంధనలు బ్రేక్ చేశారని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపాలని ఆయన కోరారు.

ఇక సినిమా షూటింగ్‌కు వచ్చిన అమీర్‌ఖాన్‌ ముఖానికి మాస్క్‌ ధరించకుండా.. పబ్లిక్‌గా తిరుగుతూ అభిమానులతో ఫొటోలు దిగారని, ఈ సమయంలో కనీస సామాజిక దూరం పాటించకుండా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందేలా ప్రవర్తించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గుర్జార్‌ పేర్కొన్నారు. అంతకుముందు ఆగస్టు నెలలో టర్కీ ప్రథమ మహిళ ఎమిన్ ఎర్డోగాన్‌ను లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్‌ కోసం టర్కీ వెళ్లినప్పుడు కలవడం వివాదస్పదమైంది.

ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కరీనా కపూర్‌ కథానాయిక. హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’కి హిందీ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను క్రిస్మస్‌ సీజన్లో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు ఆమిర్‌ ఖాన్‌. అయితే కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్స్‌కి బ్రేక్‌ పడటంతో ‘లాల్‌ సింగ్‌ చద్దా’ను ఇప్పుడిప్పుడే రిలీజ్‌ చేయడం కష్టం అంటున్నారు.  ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌తో కలిసి ఆమిర్‌ ఖాన్‌ నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది డిసెంబర్‌కి ఈ సినిమా విడుదల కానుంది.