స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చివరగా నటించిన చిత్రం నా పేరు సూర్య. ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ మ్యాన్ గా నటించాడు. నా పేరు సూర్య నిరాశపరచడంతో దాదాపు ఏడాది విరామం తర్వాత కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' చిత్రంలో నటించాల్సి ఉంది. 

సుకుమార్ తో కూడా ఓ చిత్రానికి బన్నీ కమిటై ఉన్నాడు. ఇక చాలా రోజుల క్రితమే తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. పందెం కోడి లాంటి మాస్ యాక్షన్ చిత్రాలతో లింగుస్వామి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి నిర్మించడానికి గ్రీన్ స్టూడియోస్ సంస్థ కూడా ముందుకు వచ్చింది. 

ఈ చిత్రం ఆగిపోయినట్లే అనుకుంటున్నా సమయంలో మరో వార్త వైరల్ అవుతోంది. లింగుస్వామి తాజాగా యువ హీరో హవీష్ ని డైరెక్ట్ చేసేందుకు సైన్ చేశారట. బన్నీ కోసం రూపొందించిన కథతోనే హవీష్ తో సినిమా చేయబోతున్నట్లు టాక్. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందబోతున్న ఈ చిత్రంలో హవీష్ ని లింగుస్వామి పవర్ ఫుల్ చూపించబోతున్నాడట. 

ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగష్టు చివర్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.