సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది కానీ సెన్సార్, మరికొన్ని సమస్య కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. మార్చి 29న విడుదల తేదీ ప్రకటించినప్పటికీ ఆ సమయానికి సినిమా వస్తుందా..? అనే సందేహాలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో ఈరోజు సినిమా సెన్సార్ పూర్తి కావొచ్చని నిర్మాత రాకేశ్ రెడ్డి వెల్లడించాడు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఎన్నికల సంఘం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యాడు నిర్మాత రాకేశ్ రెడ్డి. లక్ష్మీస్ ఎన్టీఆర్ పై వస్తున్న అభ్యంతరాలపై చిత్ర నిర్మాత ఎంసీఎంసీ కమిటీ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు.

అంతకు ముందు ఎన్నికల సంఘం చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దానికి ఫోన్ ద్వారా సమాధానం చెప్పాడు రాకేశ్ రెడ్డి. కానీ వ్యక్తిగతంగా రాకేశ్ రెడ్డిని ఈరోజు ఈసీ కలిశారు.వారికి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని స్పెషల్ షో వేసి చూపించారు. 

ఉదయం 11:20కి షో మొదలైంది. అంతరం స్పందించిన రాకేశ్ రెడ్డి.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకు ఈసీ అంగీకరించిందని వెల్లడించారు. సినిమా అనుకున్నట్లే ఈనెల 29న వస్తుందని అన్నారు.  ఈరోజు సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.  సినిమాలో ఏ పార్టీ గుర్తు వాడలేదని స్పష్టం చేశారు.