బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌.. ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌. మహారాష్ట్ర సర్కార్‌కి, ఆమెకి మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. అందుకు దారితీసిన అంశం నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు. ఈ కేసు విషయంలో ముంబయి పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారని, దోషులకు వంతపాడుతున్నారని, అలాగే డ్రగ్స్ కేసు విషయంలోనూ ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది కంగనా. 

దీంతో కంగనాపై ముంబయిలో రెండు కేసులో నమోదయ్యాయి. అందులో దేశద్రోహం కేసు కూడా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వీటిపై మరోసారి స్పందించింది కంగనా. ఈసారి స్వరం మరింత పెంచింది. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

రాణీ లక్ష్మీబాయి కోటను కూల్చినట్టే తన ఇంటిని కూల్చారని, తిరుగుబాటు చేసినందుకు సావర్కర్‌ లా తనని కూడా జైల్లో పెట్టాలునకుంటున్నారని, కానీ తాను దేనికీ బయపడనని స్పష్టం చేసింది. దేనికీ తలవంచనని తెలిపింది. ఈ అసహనపు దేశంలో ఎన్ని కష్టాలు పడ్డారో దయజేసి ఇంటోలరెన్స్ గ్యాంగ్‌ని అడగండని పేర్కొంది. 

ఈ సందర్భంగా మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమిర్‌ ఖాన్‌ని ఇరికించింది. తన ట్వీట్‌లో ఆయన పేరుని ట్యాగ్‌ చేసింది. `క్యాండిల్‌ మార్చ్ గ్యాంగ్‌. అవార్డు వాపసీ గ్యాంగ్‌.. చూడండి.. నేను మీలా కాదు. మహారాష్ట్రలో పాలన సాగిస్తున్న ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాను. అందులోనే నా జీవితానికి అర్థముంది. నేను అందరిలా మోసగత్తెని కాద`ని తెలిపింది. 

అయితే గతంలో అమీర్‌ఖాన్‌ `దేశంలో అసహనం పెరిగిపోతుంది. నా భార్య దేశం వదిలివెళ్ళిపోదామంటోంది` అని ట్వీట్‌ చేయడం పెద్ద దుమారం సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా కంగనా ఆయన పేరుని ట్యాగ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై అమీర్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.