తెలుగు, తమిళ సినిమాల్లో 90లలో టాప్ విలన్‌గా పేరు తెచ్చుకున్న నటుడు పొన్నంబళమ్‌. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్‌ యాక్టర్‌ అనారోగ్య కారణాలతో ఆసుపత్రి పాలయ్యారు. కిడ్నీసంబంధిత సమస్యతో బాధపడుతున్న పొన్నంబళమ్‌ చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతని ఆర్థిక పరిస్థితి అంత బాగోలేకపోవటంతో కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్‌ ఆయనకు ఆర్ధిక సాయం చేశారు.

ఫోన్‌లో పొన్నంబళమ్‌తో మాట్లాడిన కమల్‌, డబ్బు సాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. అలాగే అతని పిల్లల బాధ్యతను కూడా తీసుకుంటా అని కమల్‌ మాటిచ్చాడు. కమల్‌ టీం పొన్నంబళమ్ ఆరోగ్యపరిస్థితి గురించి కమల్‌ టీం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన సాయం చేస్తున్నారు. ఇటీవల పొన్నంబళమ్‌ ఆసుపత్రి నుంచి విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో పొన్నంబళమ్ ను చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో నటుడు ఆక్సిజన్ మాస్క్‌తో దీనంగా కనిపించటంతో అభిమానులు ఆవేదన చెందుతున్నారు. స్టంట్‌ మ్యాన్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పొన్నంబళమ్ కమల్‌ హాసన్, రజనీకాంత్‌, చిరంజీవి లాంటి టాప్‌ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు.