బాలీవుడ్‌ నటి జియా ఖాన్‌ 2013లో మరణించిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరిగింది. కానీ ఆమెని హత్య చేశారని జియా ఖాన్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇదిలా ఉంటే దీన్ని ఎనిమిదేళ్ల తర్వాత జియా ఖాన్‌ సోదరి బయటకు తీసుకొచ్చింది. ఈ మేరకు ఆమె ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ఇందులో పలు ఆసక్తికర, సంచలన విషయాలను వెల్లడించింది. 

ఇందులో దర్శక, నిర్మాత సాజిద్‌ ఖాన్‌.. జియాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వివరించింది. `హౌజ్‌ఫుల్‌` సినిమా సమయంలో సాజిద్‌తో కలిసి ఉన్నప్పుడు అతను జియాని ఎలా లైంగికంగా వేధింపులకు గురి చేశాడో తెలిపింది. `జియా పై భాగం తీయాలన్నప్పుడు ఆమె ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని భావించినా, ఆ బ్యానర్‌తో కాంట్రాక్ట్ ఉండటంతో తనపై కేసు పెట్టి, నన్ను అపవాదు చేస్తారని, ఒకవేళ ఈ సినిమాలో కొనసాగితే లైంగిక వేధింపులకు గురి కావాలి` అని జియా వాపోయినట్టు ఆమె సోదరి డాక్యుమెంటరీలో వెల్లడించింది. అలాంటి వ్యక్తికి ఇంకా శిక్ష పడకపోగా, స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడని మండిపడింది.

దీనిపై కంగనా రనౌత్‌ స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా ఆమె పేర్కొంటూ, `వాళ్లు జియాని చంపారు. సుశాంత్‌ని చంపారు. ఇప్పుడు నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్లు స్వేచ్ఛగా తిరుగుతారు. మాఫియాకి  పూర్తి మద్దతు ఉంది. ప్రతి సంవత్సరం బలంగా, సక్సెస్‌ఫుల్‌గా దాన్ని నడిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం ప్రిడేటర్ల చేతిలో ఉంది. నిన్ను ఎవరో కాపాడరు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి` అని ట్వీట్‌ చేసింది కంగనా. 

జియా ఖాన్‌ జూన్‌3, 2013లో ముంబయిలోని తన నివాసంలో చనిపోయింది. ఆమె మరణానికి సంబంధించిన కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే మూడేళ్ల క్రితం ఈ కేసులో ఆదిత్య పంచోలి కుమారుడు సురజ్‌ పంచోలి పేరును సూసైడ్‌ నోట్‌లో గుర్తించారు. ఈ నేపథ్యంలో అతనిపై ముంబయి కోర్ట్ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అయితే దీనిపై జియా సిస్టర్‌ డాక్యుమెంటరీ చేయగా, అది యూకేలో అందుబాటులో ఉంది. దాన్ని ఇటీవల బీబీసీ ఛానెల్‌ టెలికాస్ట్ చేసింది.