మహేష్‌బాబు తల్లి, కృష్ణ సతీమణి ఇందిరా దేవి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఫిల్మ్ నగర్‌లోని మహా ప్రస్థానంలో బుధవారం మధ్యాహ్నం ఈ అంత్యక్రియలు నిర్వహించారు. 

సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి, మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి అంత్యక్రియలు ముగిశాయి. పద్మాలయ స్టూడియో నుంచి ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఇందులో ఘటమనేని కుటుంబ సభ్యులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ మధ్యాహ్నం సమయంలో ఇందిరాదేవి అంత్యక్రియలు నిర్వహించారు. మహేష్‌బాబు సాంప్రదాయ పద్ధతిలో తల్లి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 

చివరిసారి ఇందిరాదేవి పార్థివ దేహాన్ని చూసి కృష్ణ, మహేష్‌ చలించిపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే అభిమాన హీరో తల్లిని కడసారి చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అంత్యక్రియల్లో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. అయితే అంత్య్రకియలకు కవరేజ్‌కి మీడియాకి అనుమతి లేకపోవడం గమనార్హం. 

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఇందిరాదేవి బుధవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో ఘట్టమనేని ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏడాదిలో రెండో మరణం సంభవించడంతో మహేష్‌, కృష్ణలు తల్లడిల్లిపోయారు. ఆ మధ్య మహేష్‌ అన్నయ్య రమేష్‌ బాబు కన్నుమూసిన విషయం తెలిసిందే. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఇందిరాదేవి భౌతిక దేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి చేశారు.