సెంటిమెంట్ మూఢనమ్మకైనా... అది గురితప్పకుండా జరుగుతుంటే నమ్మకుండా ఉండలేం. అందుకేనేమో ప్రపంచంలో 99 శాతం మంది ఈ సెంటిమెంట్స్ ఫాలో అవుతారు. చిత్ర పరిశ్రమలో ఈ నమ్మకాలు మరీ ఎక్కువ. కాగా రాజమౌళి హీరోలను ఓ సెంటిమెంట్ వెంటాడుతుంది. 

రాజమౌళి(Rajamouli)తో మూవీ చేసిన హీరో పేరిట ఇండస్ట్రీ రికార్డ్స్ నమోదవుతాయి. బాహుబలి తర్వాత ఆయన స్థాయిలో వేరే లెవెల్ కి చేరింది. రాజమౌళి సినిమా రికార్డులు హాలీవుడ్ చిత్రాల కలెక్షన్స్ కి దగ్గరవుతున్నాయి. వెలుగు వెనుకే చీకటి అన్నట్లు రాజమౌళి ఇచ్చే భారీ హిట్ వెన్నంటి ఓ పరేషాన్ కూడా ఉంటుంది. రాజమౌళితో సినిమా చేసిన హీరో నెక్స్ట్ మూవీ అట్టర్ ప్లాప్ కావలసిందే. సునీల్ నుండి చిన్న ఎన్టీఆర్ (NTR)వరకు ఎవ్వరినీ వదలకుండా ఈ సెంటిమెంట్ వెంటాడింది. 

బాహుబలి(Bahubali)తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాసిన ప్రభాస్ వరుసగా రెండు ప్లాప్స్ ఎదుర్కొన్నాడు. ఆయన గత రెండు చిత్రాలు సాహో, రాధే శ్యామ్ తెలుగులో ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. రాజమౌళితో పని చేసిన ప్రతి హీరో తర్వాత చిత్రం పరాజయం పాలైంది. ఈ క్రమంలో కొరటాల శివ రెండు గండాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

కొరటాల శివ (Koratala Siva)దర్శకుడిగా ఉన్న ఆచార్య, ఎన్టీఆర్ 30లను ఈ సెంటిమెంట్ వెంటాడితే ఆయన కెరీర్ ప్రమాదంలో పడినట్లే. ఎందుకంటే ఈ రెండు చిత్రాలు ఆర్ ఆర్ ఆర్ హీరోలతో ఆయన తెరకెక్కిస్తున్నారు. ఆచార్య(Acharya) మూవీలో ప్రధాన హీరో చిరంజీవి అయినప్పటికీ చరణ్ కీలక రోల్ చేస్తున్నారు. సినిమాలో 45 నిమిషాల నిడివి ఆయన పాత్రకు ఉంటుందని సమాచారం. పూజా హెగ్డే చరణ్ కి జంటగా నటిస్తున్న నేపథ్యంలో.. ఇది పూర్తి స్థాయి మల్టీస్టారర్ అని చెప్పవచ్చు. 

ఇక ఎన్టీఆర్ 30వ చిత్రం కొద్దిరోజుల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్, ఎన్టీఆర్ లు తమ చిత్రాలు కొరటాల దర్శకత్వంలో చేస్తున్నారు. మరి రాజమౌళి సెంటిమెంట్ కొనసాగితే ఈ రెండు చిత్రాలు ప్లాప్ అయినట్లే. రాజమౌళి తర్వాత కొరటాల సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రికార్డు మైంటైన్ చేస్తున్నారు. దర్శకుడిగా కొరటాల చిత్రాలన్నీ విజయం సాధించాయి. మరి కొరటాల ఈ గండాన్ని ఎలా అధిగమిస్తాడో చూడాలి.