హిట్ సినిమా ఏ భాషలో వచచ్చినా దాని రీమేక్ రైట్స్ ని ఎగరేసుకుపోతున్నారు నిర్మాతలు. ఎందుకంటే హిట్ సినిమా రైట్స్ తమ దగ్గర ఉంటే హీరోలు డేట్స్ ఇస్తారు. అలాగే హీరోలు సైతం ఓ చోట ప్రూవ్ అయిన సబ్జెక్ట్ కాబట్టి పెద్దగా ఆలోచించకుండా ముందుకు వెళ్లిపోవచ్చు అని ఫిక్సైపోతారు. ఇప్పుడు తెలుగులో హిట్టైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ది ఇదే పరిస్దితి.

ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ లోని పెద్ద నిర్మాణ సంస్దలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక డిజిటల్ మరియు టీవిరైట్స్ కోసం కూడా పెద్ద పెద్ద మొత్తాలతో పోటీలోకి దిగి షాక్ ఇస్తున్నారు. తమిళంలోనూ ఆర్యతో  ఈ సినిమా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఓ నిర్మాత ఎప్రోచ్ అయినట్లు సమాచారం. నవీన్‌ పొలిశెట్టిని హీరోగా పరిచయం చేస్తూ స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.

చాలా కాలం తరువాత డిటెక్టివ్‌ తరహా కథతో రూపొందించిన ఈ సినిమాకి మొదట రోజు నుంచే మంచి టాక్‌ వచ్చింది. ముఖ్యంగా నవీన్‌ నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. పాజిటివ్ రివ్యూలు రావటం ప్లస్ అయ్యింది. రైటర్ కమ్ డైరెక్టర్ `స్వరూప్ తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నాడు. కథ విషయంలో అతను ఎంతో కొత్తగా ఆలోచించాడు. నవీన్ తో కలిసి అతను రాసిన స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంది. దర్శకత్వ పరంగానూ ప్రతిభ చూపించాడు.

ఊహించని విధంగా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ, ఫస్ట్ వీకెండ్ కి పది కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఫిక్షనల్‌ కాదు ఒరిజినల్‌ బ్లాక్‌ బస్టర్‌ అంటూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.  కామెడీ టచ్ ఇచ్చి చేసిన ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకి త్వరలో మరిన్ని థియేటర్స్ పెరిగే అవకాశం కూడా ఉంది