హీరో రానా దగ్గుబాటి సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన ఇప్పటికే స్టూడియో నిర్వాహణ చూస్తున్నారు. మరోవైపు ఫిల్మ్‌ స్కూల్‌, నిర్మాణం చూసుకుంటున్నారు. హీరోగా మల్టీ లింగ్వల్‌ సినిమాలతో రాణిస్తున్నారు. వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తూ అలరిస్తున్నారు. మధ్యలో అప్పుడప్పుడు హోస్ట్ గానూ వ్యవహరిస్తున్నారు. 

ఇదంతా కాకుండా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. `సౌత్‌బే` పేరుతో ఈ యూట్యూబ్‌ ఛానెల్‌ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇందులో మల్టీలింగ్వల్‌ కంటెంట్‌ని అందించబోతున్నారు. కొత్త ప్రతిభని ఎంకరేజ్‌ చేయనున్నారు. పది సెకన్ల నుంచి పది గంటల వరకు కథలను చెప్పబోతున్నారు.

 కేవలం స్టోరీలే కాదు, మ్యూజిక్‌, షార్ట్ ఫామ్‌, న్యూస్‌, యానిమేషన్‌, ఫిక్షన్ అంశాల్లో కూడా ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని రానాతోపాటు బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ ద్వారా తెలిపారు. లాక్‌డౌన్‌ తర్వాత డిజిటల్‌ మాధ్యమాలకు ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో రానా ఈ యూట్యూబ్‌ ఛానెల్‌ని ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ బాగా ఆకట్టుకుంటుంది.

 ప్రస్తుతం రానా `హరణ్య`, `హిరణ్య కశ్యప`, `విరాటపర్వం`, వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు బాబాయ్‌ వెంకీతో కలిసి ఓ మల్టీస్టారర్‌ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. తమిళంలో విజయం సాధించిన చిత్రానికి రీమేక్‌ అని టాక్‌. దీనికి వీరు పోట్ల దర్శకత్వం వహిస్తారట.