ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ కి సిద్ధం అవుతున్నారు. ఆయన అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుతుంది. 


ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ అమెరికాలో ఉన్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఈవెంట్లో దర్శకుడు రాజమౌళితో పాటు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, కొడుకు కార్తికేయ పాల్గొన్నారు. ఇక రామ్ చరణ్ HCA అవార్డ్స్ వేడుకకు స్పెషల్ గెస్ట్స్ లో ఒకరిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ఒక అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అలాగే ఆయన్ని స్పాట్ లైట్ అవార్డుతో సత్కరించారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ అమెరికాలో సందడి చేస్తూ అంతర్జాతీయ మీడియాలో హైలెట్ అవుతుంటే ఎన్టీఆర్ కనిపించకపోవడం ఒకింత నిరాశ కలిగిస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ టీమ్ తో పాటు అమెరికా వెళ్లకపోవడానికి బలమైన కారణం ఉంది. ఫిబ్రవరి 18న అన్నయ్య తారకరత్న కన్నుమూశారు.దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వేదనలో ఉన్న ఎన్టీఆర్ వేడుకలకు దూరంగా ఉన్నారు. అలాగే తారకరత్న మరణాంతర కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదు. మార్చి 2న తారకరత్న పెదకర్మ జరగనుంది. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఎన్టీఆర్ అమెరికా బయలుదేరనున్నారు. మార్చి 6న ఆయన అమెరికా వెళుతున్నట్లు సమాచారం అందుతుంది. 

ఆస్కార్ వేడుక మార్చి 12న జరుగుతుంది. ఈ లోపు ఆయన హాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే సూచనలు కలవు. ఇక HCA అవార్స్ కి రామ్ చరణ్ ని మాత్రమే ఆహ్వానించడం మీద విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో HCA స్పందించింది. మేము ఎన్టీఆర్ ని కూడా ఆహ్వానించాము. ఆయన ఇండియాలో ఓ చిత్ర షూటింగ్ లో ఉన్న కారణంగా హాజరుకాలేదు. ఆయనకు అవార్డు త్వరలో అందజేస్తామంటూ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు.

ఇక ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ఎన్టీఆర్ నడుస్తారని సమాచారం. అలాగే నాటు నాటు సాంగ్ ని ఆస్కార్ వేదికపై లైవ్ లో కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడనున్నారు. నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేటైన విషయం తెలిసిందే. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు ఆస్కార్ సైతం కైవసం చేసుకుంటుందనే విశ్వాసం టీమ్ వ్యక్తం చేస్తున్నారు. మరో పది రోజుల్లో ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ భవితవ్యం తేలనుంది. ఆస్కార్ గెలిస్తే ఇండియా సినిమాకు అరుదైన ఘట్టం అవుతుంది.