గల్లీ బాయ్ రాహుల్ సిప్లిగంజ్ అరుదైన గౌరవం అందుకున్నారు. 95వ అకాడమీ అవార్డ్స్ వేదికపై ఆయన కాల భైరవతో కలిసి నాటు నాటు సాంగ్ లైవ్ ఫర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.
ఒకప్పటి యూట్యూబర్ రాహుల్ సిప్లిగంజ్ ఎవరూ కలలో కూడా ఊహించని గౌరవం దక్కించుకున్నాడు. ఆయన ఆస్కార్ వేదికపై పాడనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సినిమా వేడుక ఆస్కార్ కి ఆహ్వానం దక్కడమే గొప్ప గౌరవంగా భావిస్తారు. అలాంటిది రాహుల్ సిప్లిగంజ్ అతిరథ మహారథుల ముందు తన గానం వినిపించనున్నారు. కీరవాణి కుమారుడు కాల భైరవతో పాటు నాటు నాటు సాంగ్ లైవ్ ఫర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. ఈ మేరకు అకాడమీ సభ్యులు అధికారిక ప్రకటన చేశారు.
ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన విషయం తెలిసిందే. మార్చి 12న లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న ఆస్కార్ వేడుకలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ పాల్గొననున్నారు. ఆ రోజు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవల నాటు నాటు లైవ్ ఫర్ఫార్మన్స్ హైలెట్ కానుంది. నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఆస్కార్ వరిస్తుందని టీమ్ గట్టి విశ్వాసంతో ఉన్నారు.
కీరవాణి ఈ సాంగ్ స్వరపరచగా... రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్స్ తో పాటకు విపరీతమైన ఆదరణ తీసుకొచ్చారు. ఇక మరికొన్ని రోజుల్లో ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ భవితవ్యం తేలనుంది. నాటు నాటు ఆస్కార్ గెలుచుకుంటే... అదో అరుదైన ఘటనగా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో నిలిచిపోతుంది.
ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ టీమ్ అమెరికాలో ఉన్నారు. వీరితో ఎన్టీఆర్ జాయిన్ కానున్నారు. తారకరత్న పెదకర్మ మార్చి 2న ముగియనుంది. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మార్చి 6న ఎన్టీఆర్ అమెరికా బయలదేరనున్నారని సమాచారం. ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ఎన్టీఆర్ నడవనున్నారు. ఆస్కార్ వేదికగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ సందడి చేయనున్నారు. ఇండియన్ సినిమా వర్గాలు ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రయాణాన్ని నిశితంగా గమనిస్తున్నాయి.
