ఓ పెద్ద సినిమా గురించి ఎనౌన్సమెంట్ వచ్చిందంటే ఆ సినిమా కథేంటి, అందులో ట్విస్ట్ లు ఏంటి..టైటిల్ ఇదే, హీరోయిన్ గా ఫలానా అంటూ వార్తలు వరస పెట్టి వచ్చేస్తూంటాయి. ఇప్పుడు మరో ట్రెండ్ మొదలైంది. ఫలానా వాళ్లను సినిమాలో తీసుకుంటారు. వాళ్లు ఫలానా క్యారక్టర్ వేస్తారు అని.ఈ వార్తల వలన ఆ సినిమాకు వచ్చే నష్టమేమీ ఉండదు కానీ, వింతగా అనిపిస్తూంటాయి. తాజాగా మీడియాలో ఓ కొత్త వార్త మొదలైంది. మహేష్,త్రివిక్రమ్ సినిమాలో పాత్రలు గురించి. 

స్టార్ డైరక్టర్స్  తమ సినిమాకు రిచ్ లుక్ అద్దేందుకు చిన్న పాత్రకు కూడా పెద్ద ఆర్టిస్ట్ లను తీసుకొస్తూంటారు. అప్పట్లో రాఘవేంద్రరావు ,ఈ కాలంలో త్రివిక్రమ్ దాన్ని ఫాలో అవుతున్నారు. అలా చేస్తే ఆ పాత్రకు వెయిటేజీ బాగా వస్తుందని, జనాల్లోకి స్పీడుగా వెళ్లిపోతుందని నమ్ముతారు. త్రివిక్రమ్ సినిమాలను గమనిస్తే అది అర్దమవుతుంది. అత్తారింటికి దారేదీలో నదియా,'సన్నాఫ్ సత్యమూర్తి'లో స్నేహ, 'అజ్ఞాతవాసి' లో ఖుష్బూ.. 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో దేవయాని, అల వైకుంఠ‌పుర‌ములో ట‌బు, సుశాంత్ ఇలా ప్ర‌తీ పాత్ర‌కూ పేరున్న‌వాళ్లే క‌నిపించి మురిపిస్తారు. అందుకే త్రివిక్రమ్ సినిమా పోస్టర్ అన‌గానే భారీలుక్ వచ్చేస్తుంది. అందంగా క‌నిపిస్తుంటుంది.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ..ఇప్పుడు కూడా సేమ్ ఫార్ములా ఫాలో అవుతున్నాడు త్రివిక్ర‌మ్. మ‌హేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం ఆర్టిస్ట్ ల ఎంపికలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారదట. ఈనెల 31న లాంఛ‌నంగా ప్రారంభం అయ్యే ఈ సినిమాలో ఓ కీల‌క‌మైన పాత్ర కోసం.. శిల్పాశెట్టిని ఎంచుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

అలాగే  మ‌రో పాత్ర కోసం అక్కినేని సుమంత్ ని తీసుకోవాల‌ని భావిస్తున్నార్ట‌. ఇంక వీళ్లు చేసే క్యారక్టర్స్ విషయానికి వస్తే.. మ‌హేష్ కి అత్త‌గా శిల్ప‌.. బావ‌గా సుమంత్ క‌నిపించనున్నారని చెప్తున్నారు. ఇది చదివిన వారు ఒళ్లు మండి, మరి మహేష్ కు తాతగా చేసేదెవరు అని సోషల్ మీడియాలో వెటకారం చేస్తున్నారు. ఇక  ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే దాదాపుగా ఖాయ‌మైపోయింద‌ని టాక్‌. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ(చినబాబు) ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని నిర్మిస్తున్నారు.