త్రిష ఓ ఫిలిం డైరెక్టర్ తో పెళ్ళికి సిద్దమైనట్లు కోలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ఆమె పీఆర్ టీమ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.
స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలిన త్రిష కృష్ణన్ పెళ్లి చేసుకోనున్నారంటూ కొద్దిరోజులుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఓ దర్శకుడితో పెళ్ళికి ఆమె సిద్దమైనట్లు సదరు వార్తల సారాంశం. అయితే దీనిపై త్రిష పీఆర్ టీమ్ స్పష్టత ఇచ్చింది. 38ఏళ్ల త్రిష పెళ్లి టాపిక్ తరచుగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. కోలీవుడ్ మన్మథుడు శింబుతో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపిన ఆమె, అతన్ని పెళ్లి చేసుకున్నారని అప్పట్లో కథనాలు వినిపించాయి.
అలాగే గతంలో టాలీవుడ్ హీరో రానా, త్రిష రిలేషన్ హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలిసి డేటింగ్ చేశారన్న వార్తలు గుప్పు మన్నాయి. రానా, త్రిషల ప్రైవేట్ ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో హల్ చల్ చేశాయి. ఇక రానా పెళ్లి ప్రకటన తరువాత త్రిష వరుస సోషల్ మీడియా పోస్ట్స్ అనేక అనుమానాలకు తావిచ్చాయి.
కాగా 2015లో చెన్నైకి చెందిన బిజినెస్ మాన్ వరుణ్ మణియన్ తో త్రిష ఎంగేజ్మెంట్ జరుపుకుంది. కారణం ఏమిటో తెలియదు కానీ, తర్వాత ఆ వివాహాన్ని త్రిష రద్దు చేసుకున్నారు. తాజాగా త్రిష ఫిలిం డైరెక్టర్ ని వివాహం చేసుకోనున్నారని వార్తలు రాగా, ఆమె పీఆర్ టీమ్ ఖండించారు. త్రిష పెళ్లి వార్తలలో ఎటువంటి నిజం లేదని, అవన్నీ నిరాధార ఆరోపణలు అని తేల్చి చెప్పడం జరిగింది. దీనితో త్రిష పెళ్లి వార్తలకు ఎప్పటిలాగే మరోమారు తెరపడింది.
