కమెడియన్ వేణు జబర్దస్త్ మానేయడంపై స్పందించారు. బలగం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఆయన స్పష్టత ఇచ్చారు.  

జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో వేణు ఎల్దండి ఒకరు. అప్పటికే కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించిన వేణుకు జబర్దస్త్ ఛాన్స్ వచ్చింది. వేణు వండర్స్ టీమ్ కి ఆయన లీడర్ గా వ్యవహరించారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఈయన టీమ్ లో ఎదిగిన కమెడియన్స్. అయితే వేణు ఎక్కువ కాలం అక్కడ ఉండలేదు. కొన్నాళ్ల తర్వాత జబర్దస్త్ మానేశారు. ఆరంభంలో టీమ్ లీడర్స్ గా ఉన్న రోలర్ రఘు, ధనాధన్ ధన్ రాజ్ కూడా జబర్దస్త్ వీడడం జరిగింది. దీంతో మల్లెమాల సంస్థతో ఏర్పడిన విభేదాల కారణంగా షో మానేశారనే ప్రచారం జరిగింది. 

దీనిపై వేణు ఎల్దండి స్పందించారు. విబేధాలతో జబర్దస్త్ నుండి బయటకు వచ్చాను అనడంలో వాస్తవం లేదు. కేవలం సినిమా పై మక్కువతో జబర్దస్త్ వదిలేశాను. మొదటి నుండి నా లక్ష్యం సినిమా. ఫుల్ టైం సినిమాల్లో రాణించాలనే కోరిక ఉంది. జబర్దస్త్ లో నేను ఉన్నప్పుడు రేటింగ్ బాగుంది. మంచి రెమ్యూనరేషన్ వస్తుంది. అయినప్పటికీ సినిమా కోసం వదులుకొని బయటకు వచ్చానని వేణు అన్నారు. కాగా వేణు చేసిన ఓ స్కిట్ వివాదాస్పదమైంది. ఓ కమ్యూనిటీ ఆయనపై దాడి చేయడం జరిగింది. 

తాజాగా దర్శకుడు అవతారం ఎత్తిన వేణు సూపర్ హిట్ కొట్టారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన బలగం ఊహకు మించిన విజయం సాధించింది. అలాగే బెస్ట్ కంటెంట్ కలిగిన ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ మూవీగా పేరు తెచ్చుకుంది. వేణులో ఇంత టాలెంట్ ఉందా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. బలగం సక్సెస్ నేపథ్యంలో ఆయనకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

మరోవైపు బలగం మూవీ కథ వివాదంలో చిక్కుకుంది. జర్నలిస్ట్ సతీష్ గడ్డం బలగం కథ నాదే అంటూ ఆరోపణలు చేశారు. దీన్ని వేణు ఖండించారు. ఆరేళ్ళు రీసెర్చ్ చేసి తయారు చేసుకున్న నా సొంత కథ అంటూ కొట్టిపారేశారు. గడ్డం సతీష్ ఆరోపణల్లో నిజం లేదని మీడియా వేదికగా వివరణ ఇచ్చారు.