సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ మృతి కేసులో అనేక కొత్త కోణాలు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. ఆమెది కూడా ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. బీజేపీ నాయకులు దిశాది ఆత్మహత్య కాదు, ఆమెని హత్య చేశారని ఆరోపించారు. దిశా స్నేహితురాలు ఆమె అపార్ట్ మెంట్‌పై దూకిందని మరో వాదన చెప్పింది. దీంతో ముంబయి పోలీసులు అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకి, దిశా ఆత్మహత్యకి ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ ఇన్వెస్టిగేషన్‌ జరుగుతుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా తన కూతురు మరణానికి సంబంధించి తప్పుడు పుకార్లు సృష్టిస్తున్నారని దిశా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ముగ్గురు వ్యక్తులపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశా మరణం గురించి పుకార్లు వ్యాప్తి చేసినందుకుగానూ ముగ్గరు వ్యక్తులపై ఆయన శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కొంత మంది సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణాన్ని, దిశా మరణంతో కలిపి వాట్సాప్‌ ఫార్వర్డ్ మెసేజ్‌లు చేస్తున్నారని, సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారని, సుశాంత్‌ మరణానికి, దిశా మరణానికి సంబంధం ఉందని ఆరోపిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పునీత్‌ విశిష్ట, సందీప్‌ మలాని, నమన్‌ శర్మలపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురు తన కుమార్తె పరువు తీశారని, ఆమె గురించి పలు తప్పుడు పుకార్లు క్రియేట్‌ చేశారని దిశా తండ్రి సతీష్‌ సలియన్‌ ముంబయిలోని మల్వాని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారి తప్పుడు పోస్టులు తమని ఎంతగా వేధిస్తున్నాయో తెలిపారు. 

ఈ కేసుని మల్వాని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తుంది. కేసుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే దానిపై చట్టపరమైన అభిప్రాయాలను తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. అంతేకాదు ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. సరైన చట్టపరమైన అభిప్రాయాలు తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని, అనంతరం వారిని విచారిస్తామని తెలిపారు.