తనపై వచ్చిన ఆరోపణలపై దర్శకుడు రాజేష్‌ టచ్‌ రివర్‌ స్పందించారు. ఇది పూర్తి నిరాధారమైన ఆరోపణలని ఖండించారు. 

తనని 14 మంది లైంగికంగా వేధిస్తున్నారని మలయాళ నటి రేవతి సంపత్‌ ఇటీవల ఆరోపించింది. అంతేకాదు వారి పేర్లతో సహా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. 14 మందిలో సినీ రంగానికి చెందిన దర్శకుడు రాజేష్‌ టచ్‌ రివర్, నటులు సిద్ధిఖ్‌, సిజ్జు, ఫోటోగ్రాఫర్‌, అలాగే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై దర్శకుడు రాజేష్‌ టచ్‌ రివర్‌ స్పందించారు. ఇది పూర్తి నిరాధారమైన ఆరోపణలని ఖండించారు. 

ఆయన మాట్లాడుతూ, `నా మీద మీడియాలో వస్తున్న కథనాలను చూసి ఆశ్చర్యపోయాను. ఈ ఆరోపణలకు స్పందించాల్సిన బాధ్యత నాపై వుంది కాబట్టి స్పందిస్తున్నాను. నాపై ఆ యువతి నిరాధారమైన ఆరోపణలను చేస్తూ, ఏ చట్టపరమైన వేదికను ఆశ్రయించకుండా సులభ పద్దతి అయిన సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంది. సోషల్ మీడియా ద్వారా ఎవరినైనా అపఖ్యాతి పాలు చేయడం సులభం. దానికి ఆధారాలు నిరూపించాల్సిన అవసరం లేదు అందుకే దాన్ని వేదికగా తీసుకుంది. 

నేను ప్రతి పాత్రికేయులకి గౌరవం ఇస్తాను. పాత్రికేయ విలువలను గౌరవిస్తాను. అయినప్పటికీ పరువు నష్టం కలిగించే ఆధారాలు లేని ఒక ఫేస్ బుక్ పోస్ట్ ను ఆధారంగా తీసుకొని మీరు నా ఫోటోను ప్రచురిస్తూ, పరువు నష్టం కలిగించే వ్యాసాలలో నా పేరు ను ఉపసంహరించాలని అభ్యర్థిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి నిరాధారమైన వార్తల్లో కూడా నా పేరు ఊపయోగించకుండా ఉండాలని మీడియాను కోరుకుంటున్నా` అని రాజేష్ టచ్ రివర్ తెలిపారు. తమపై ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఆయన దర్శకత్వంలో రూపొందిన `పట్నఘడ్‌` చిత్రంలో రేవతి సంపత్‌ నటిగా చిత్ర పరిశ్రమకి పరిచయమైన విషయంతెలిసిందే. ఇదిలా ఉంటే రాజేష్‌ టచ్‌ రివర్‌ తెలుగు సినిమా `నా బంగారు తల్లి` చిత్రానికిగానూ జాతీయ అవార్డు అందుకున్నారు.మొత్తంగా దీనికి మూడు జాతీయ అవార్డులు, మూడు నంది అవార్డులు వరించాయి. అలాగే ఆయన రూపొందించిన `నా బంగారు తల్లి`, `పట్నఘడ్‌`, `రక్తం` వంటి చిత్రాలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శించబడ్డాయి. జాతీయ అవార్డు డైరెక్టర్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంపై అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో ఆయన తప్పేం లేదని చెబుతూ సదరు నటిపై విమర్శలు గుప్పిస్తున్నారు.