Asianet News TeluguAsianet News Telugu

మంచు విష్ణు మానసికంగా వేధిస్తున్నాడు.. దర్శకుడి కామెంట్స్!

టాలీవుడ్ హీరో మంచు విష్ణు తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ 'ఓటర్' మూవీ దర్శకుడు కార్తిక్ రెడ్డి ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

director karthik reddy sensational comments on manchu vishnu
Author
Hyderabad, First Published May 2, 2019, 2:15 PM IST

టాలీవుడ్ హీరో మంచు విష్ణు తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ 'ఓటర్' మూవీ దర్శకుడు కార్తిక్ రెడ్డి ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై కార్తిక్ రెడ్డి దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి విషయాన్ని వెల్లడించారు.

హీరో మోహన్ బాబు నటించిన 'అసెంబ్లీ రౌడీ' చిత్రానికి, తాను రాసుకున్న 'ఓటర్' కథకు ఎలాంటి సంబంధం లేకపోయినా 'అసెంబ్లీ రౌడీ'ని ఓటర్ పేరుతో అడాప్ట్ చేయడానికి బలవంతంగా తప్పుడు అగ్రిమెంట్ చేయించుకున్నారని.. తనను బెదిరించి మంచు విష్ణు, విజయ్ కుమార్ రెడ్డిలు అగ్రిమెంట్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని దర్శకుడు కార్తిక్ రెడ్డి ఆరోపించారు.

ముందుగా 'పవర్ ఫుల్' అనే కథను  రాసుకొని ఓటర్ సినిమా తీశానని, ఆ కథను రచయిత సంఘంలో రిజిస్టర్ కూడా చేయించినట్లు చెప్పారు. ఆ కథ నచ్చడంతో మంచు విష్ణు  నటించడానికి ఒప్పుకున్నట్లు చెప్పారు. ఆ తరువాత సినిమా పేరుని 'ఓటర్'గా మార్చినట్లు చెప్పారు. షూటింగ్ దశలో కూడా కొన్ని సీన్లు మార్చాలని విష్ణు తనపై ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారని, తనకు స్వేచ్చ ఇవ్వకుండా ప్రతీ విషయంలో జోక్యం చేసుకునేవారని చెప్పుకొచ్చారు కార్తిక్ రెడ్డి.

సినిమా అవుట్ పుట్ బాగా రావడంతో మంచి పేరు వస్తుందని భావించి కథ, స్క్రీన్ ప్లే క్రెడిట్స్ తనకు ఇవ్వాలని మంచు విష్ణు డిమాండ్ చేశాడని, ఒప్పుకోకపోయేసరికి బెదిరించినట్లు దర్శకుడు చెప్పారు. ఆయన బెదిరింపులు తట్టుకోలేక స్క్రీన్ ప్లే రైటర్ గా మంచు విష్ణు పేరు వేసినట్లు వెల్లడించారు కార్తిక్ రెడ్డి. విష్ణు కారణంగా మానసిక క్షోభ అనుభవించినట్లు చెప్పుకొచ్చారు.

ఇప్పుడు సినిమాను విడుదల కానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన విజయ్ కుమార్ రెడ్డి 'అసెంబ్లీ రౌడీ' స్క్రీన్ ప్లే వాడుకున్నందుకు దర్శకనిర్మాతలు కలిసి ఒప్పందం రాసుకున్నారని, దానికి కొంత మొత్తం కూడా చెల్లిస్తానని దర్శకుడు చెప్పినట్లు విజయ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు  డబ్బు గురించి అడిగేసరికి కట్టుకథలు చెబుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు వెల్లడించారు. మరి ఈ విషయంలో మంచు విష్ణు స్పందిస్తారేమో చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios