సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య బాలీవుడ్‌ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సుశాంత్ మరణంతో హిందీ సినీ పరిశ్రమలో చీకటి కోణాలు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి. గతంలో కంగన ఇండస్ట్రీ మీద చేసిన ఆరోపణలు నిజమే అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అదే సమయంలో ఇండస్ట్రీ కొంత మంది చేతుల్లోనే ఉందని వారు ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చే వారిని ఎదగనివ్వటం లేదన్న వాదన వినిపిస్తోంది.

తాజాగా దర్శకుడు అభినవ్‌ కశ్యప్ చేసిన ఆరోపణలు ఈ వివాదానికి మరింత ఊతమిస్తున్నాయి. సల్మాన్‌ ఖాన్ హీరోగా దబాంగ్ సినిమాను తెరకెక్కించాడు అభినవ్‌. అయితే ఆ తరువాత దబాంగ్ సీక్వెల్‌ను కూడా అభినవ్‌ తెరకెక్కించాల్సి ఉండగా సల్మాన్‌ కుటుంబం తనకు ఆ అవకాశం రాకుండా చేసిందని చెప్పాడు. సల్మాన్‌ సోదరులు సోహైల్‌, అర్బాజ్‌ల కారణంగానే దబాంగ్ సీక్వెల్‌ అవకాశం నాకు రాలేదని చెప్పాడు అభినవ్‌.

అంతేకాదు ఆ తరువాత అభినవ్ దర్శకత్వంలో తెరకెక్కిన బేషరమ్ సినిమా విడుదలను అడ్డుకునేందుకు సల్మాన్‌, అతని కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రయత్నించారని ఆరోపించాడు. అంతేకాదు సుశాంత్ మరణంపై కూడా సంచలన ఆరోపణలు చేశాడు అభినవ్‌. సుశాంత్‌ను హత్య చేశారని అతని మృతిపై సీబీఐ విచారణ చేయించలి అని తెలిపాడు. నాకు నా శత్రువులు ఎవరో తెలుసు అన్న అభినవ్‌.. సలీం ఖాన్, సల్మాన్‌ ఖాన్‌, అర్భాజ్‌ ఖాన్, సోహైల్‌ ఖాన్‌ నాకు శత్రువులు అంటూ బహిరంగంగా ప్రకటించాడు. వాళ్లు తమకంటూ కెరీర్‌ను ప్లాన్ చేసుకోకుండా ఎదుటి వారి జీవితాన్ని నాశనం చేస్తారంటూ ఆరోపణలు చేశాడు.