2023 ఏడాదికిగానూ ఇటీవల నేషనల్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. మన తెలుగు వారికి ఏడు పురస్కారాలు వరించగా, తాజాగా వారిని సీఎం సత్కరించారు.
KNOW
ఇటీవల 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో అవార్డులు గెలుచుకున్న తెలుగు సినిమా ప్రముఖులను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. సోమవారం సాయంత్రం జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో విజేతలను గౌరవించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ, భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్‌ను నిలపాలని అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతను అందిస్తామని ఆయన తెలిపారు.
జాతీయ అవార్డు విన్నర్స్ కి సీఎం సత్కారం
71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్సుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అవార్డు గ్రహీతలైన `భగవంత్ కేసరి` సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి, `హనుమాన్` డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, `హనుమాన్` సినిమాకు విజువల్ ఎఫెక్ట్ కు సంబంధించి వెంకట్, శ్రీనివాస్, టీమ్ సభ్యులు, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ.. `బేబి` సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్, సింగర్ రోహిత్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో `హనుమాన్` సినిమా నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి, బేబి సినిమా నిర్మాత ఎస్కేఎన్, భగవంత్ కేసరి నిర్మాత గారపాటి సాహు తదితరులు పాల్గొన్నారు.
`బేబి" మూవీ టీమ్ ను సత్కరించిన రేవంత్ రెడ్డి
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకున్న "బేబి" సినిమా టీమ్ ను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. `బేబి` సినిమా నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ ను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు.
తమకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న దర్శక, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు సీఎం రేవంత్ రెడ్డి సత్కరించిన వారిలో ఉన్నారు.
71 జాతీయ అవార్డ్స్ లో బేబి సినిమా రెండు అవార్డ్స్ గెల్చుకుంది. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) పురస్కారం దక్కించుకున్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల మనసుల్ని గెల్చుకుంది.
