తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధితో పాటు ఇతర విషయాలను చర్చించేందుకు సినీ పెద్దలు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలిశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, దిల్‌ రాజు, సురేష్‌ బాబు, సీ కళ్యాణ్‌, దామోదర్‌ ప్రసాద్‌లు జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ అయిన వారిలో ఉన్నారు. ఈ చర్చల్లో భాగంగా ఇప్పటికే షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జగన్‌కు చిత్ర పరిశ్రమ తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సినీ ప్రముఖులు ఈ రోజు మధ్యాహ్నానికి గన్నవరం చేరుకున్నారు. అక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తరువాత 2 గంటల 45 నిమిషాల సమయంలో తాడేపల్లిలో సీఎం జగన్‌ నివాసానికి చేరుకున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ లో సినీ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కరోనా ప్రభావం తరువాత షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం సింగిల్‌ విండో పద్దతిలో చిత్రయూనిట్‌ అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం స్టూడియోల నిర్మాణం లాంటి వాటికి రాయితీ ఇచ్చేందుకు కూడా ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా తమ ప్రతిపాదనలన్నింటికీ జగన్ సానుకూలంగా స్పందించినట్టుగా మెగాస్టార్‌ చిరంజీవి వెల్లడించారు. సినీ పరిశ్రమలో సమస్యలతో పాటు టికెటింగ్‌ విధానంలో మార్పుల గురించి కూడా సీఎంతో చర్చించినట్టుగా వెల్లడించారు. బెంగళూరు, చెన్నై తరహాలో సినిమాను బట్టి టికెట్‌ రేటు పెంచే విధానం అమల్లోకి తీసుకురావాలని కోరినట్టుగా తెలిపారు. అదే సమయంలో నంది అవార్డు వేడుకపై కూడా చర్చించినట్టుగా తెలిపారు. ముఖ్యంగా వైజాగ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్టుగా చిరంజీవి వెల్లడించారు.

ఈ నేపథ్యంలో సినీ ప్రముఖలు ఆంధ్రప్రదేశ్‌లో ఇండస్ట్రీ అభివృద్దికి కావాల్సిన విషయాలను సీఎం ముందు ప్రస్తావించనున్నారు. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చిరంజీవి నాయకత్వంలో జరిగిన చర్చలకు తనకు ఆహ్వానించకపోవటంపై బాలకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం చిలికి చిలికి గాలిగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా భేటీకి బాలకృష్ణను ఆహ్వానించినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ జగన్‌ను కలిసిన వారిలో బాలయ్య మాత్రం లేరు.