`ఠాగూర్`, `ఖైదీ నెంబర్ 150` చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్నారు చిరంజీవి, వినాయక్. ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ హిట్ కోసం కలవబోతున్నారట. త్వరలో సినిమా రాబోతుందని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి చేతిలో గతేడాది మూడు నాలుగు సినిమాలున్నాయి. అత్యంత బిజీ హీరోగా నిలిచారు. కట్ చేస్తే ఏడాది గ్యాప్‌తోనే మూడు సినిమాలను రిలీజ్ చేశాడు. దీంతో ఖాతా ఖాళీ అయ్యింది. ఇప్పుడు `భోళాశంకర్` మాత్రమే ఆయన చేతిలో ఉంది. ఇది కూడా మరో ఆరు నెలల్లో రిలీజ్ కాబోతుంది. మరి నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. నెక్ట్స్ సినిమా ఓకే చేయడం ఇప్పుడు మెగాస్టార్‌కి పెద్ద సవాల్‌గా మారింది.
చిరుతో సినిమాలు చేసేందుకు ముగ్గురు నలుగురు దర్శకులు క్యూలో ఉన్నారనే టాక్ వినిపించింది. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఓ కథ చెప్పారని, బైలింగ్వల్‌గా ప్లాన్ చేస్తున్నారని పుకార్ నడిచింది. దీనిపై ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతోపాటు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనూ సినిమా చేసేందుకు చిరు సిద్ధంగానే ఉన్నారట. అయితే ఇతరుల వద్ద కథ తీసుకోవాలనే కండీషన్ పెట్టారని సమాచారం. దీంతో ఇది కూడా ఇప్పట్లో అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు నాగార్జునతో `సోగ్గాడే చిన్ని నాయన`, `బంగార్రాజు` చిత్రాలు చేసిన యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కూడా ఇటీవలే ఓ కథ నెరేట్ చేశారట. కానీ చిరంజీవి కొన్ని మార్పులు చెప్పారని సమాచారం.
దీంతో ఇవన్నీ అలా చర్చల దశలోనే ఉన్నాయని, కానీ ఫైనల్ స్టేజ్‌కి రాలేదు. ఈ జాబితాలోనే బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు వి వి వినాయక్ పేరు కూడా వినిపించింది. వినాయక్‌తో సినిమా చేసేందుకు చిరు రెడీగా ఉన్నారట. కథని రెడీ చేసుకోమని కూడా చెప్పారట. కథ కుదిరితే ఇమ్మిడియెట్‌గా వినాయక్ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. కానీ అక్కడే పెద్ద ట్విస్ట్ఉంది. వినాయక్‌కి కథ దొరకడం లేదు. చిరంజీవికి నచ్చే, చిరుని మెప్పించే కథ రావడం లేదట. దీంతో వెయిటింగ్‌లో ఉన్నారని సమాచారం. వెంటనే సినిమాని స్టార్ట్ చేసేందుకు మెగాస్టార్ రెడీగా ఉన్నా, కథ దొరక్కపోవడంతో వినాయక్ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారట.
వినాయక్ స్వయంగా కథలు రాసుకోరు. కెరీర్ బిగినింగ్‌లో రెండు మూడు సినిమాలు సొంత కథలతోనే చేసినా, ఆ తర్వాత ఆయన ఇతర రైటర్లపైనే ఆధారపడతారు. చాలా వరకు ఆయన రీమేక్‌లు చేసి హిట్లు అందుకున్నారు. ఇప్పుడు రీమేక్‌లు కూడా వర్కౌట్ కావడం లేదు. దీంతో వాటి జోలికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఒరిజినల్ స్టోరీతోనే సినిమా చేయాల్సిన పరిస్థితి. ఇది ఇప్పుడు వినాయక్‌ని కట్టేనట్టయిపోయింది. మరి మంచికథ ఎప్పుడొస్తుంది? సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది పెద్ద సస్పెన్స్. చిరుకి నచ్చిన కథ వెంటనే పట్టాలెక్కబోతుందని చెప్పొచ్చు.
చిరంజీవి, వినాయక్ కాంబినేషన్‌లో గతంలో `ఠాగూర్`, `ఖైదీ నెంబర్ 150` చిత్రాలు వచ్చాయి. సంచలన విజయాలు సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న `భోళాశంకర్` చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా, తమన్నా కథానాయికగా నటిస్తుంది. కీర్తిసురేష్ చెల్లిగా నటిస్తుంది. ఇది తమిళంలో హిట్ అయిన `వేదాళం`కి రీమేక్.
