మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా ట్రైలర్ వచ్చేసింది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, చిరంజీవి పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. దీనితో సైరా చిత్రంపై అంచనాలు పెంచే విధంగా ట్రైలర్ ఉందని చెప్పడంలో సందేహం లేదు. 

ట్రైలర్ లో ఓ ప్రత్యేకమైన షాట్ అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ట్రైలర్ ఆరంభంలో వాయిస్ ఓవర్ లో ఓ డైలాగ్ వినిపిస్తుంది. నరసింహారెడ్డి సామాన్యుడు కాదు.. అతడు కారణజన్ముడు.. అతనొక యోగి.. అతనొక యోధుడు అనే డైలాగ్ వినిపిస్తున్న సమయంలో చిరంజీవి ఓ శివలింగం వద్ద తపస్సు చేస్తున్నట్లు కనిపిస్తాడు. 

మెగాస్టార్ అలా కూర్చుని ఉన్నది నీటి అడుగున. నీటి లోపల కొంత సమయం శ్వాస ఆపుకుని ఉండగలగడం ఓ కళ. దానిపేరే 'జలస్తంభన విద్య'. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం చివర్లో దుర్యోధనుడు ఈ విద్యతో నీటి అడుగు దాక్కుంటాడు. 

ఇక 1882కి చెందిన బాడీ బిల్డర్ కోడి రామ్మూర్తి నాయుడుకి ఈ విద్య తెలుసు. బ్రిటిష్ వారికి కనిపించకుండా దాడి చేసేందుకు ఈ విద్యని సైరా చిత్రంలో ఉపయోగించారు. ఈ సన్నివేశాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన ప్రతిభతో అద్భుతంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సీన్ తర్వాత అండర్ వాటర్ ఫైట్ మొదలవుతుందట.