రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన `ఛత్రపతి` చిత్రం ఎంతటి సూపర్‌ హిట్‌గా నిలిచిందో తెలిసిందే. ప్రభాస్‌ కెరీర్‌లో టాప్‌ 5లో నిలిచిపోయే చిత్రమది. ఇంకో రకంగా చెప్పాలంటే, ఆ టైమ్‌లో ప్రభాస్‌కి తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. తాజాగా ఈ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నారు. బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ ఈ చిత్రంతో హిందీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తుండగా, వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై డాక్టర్‌ జయంతిలాల్‌ గడ హిందీలో నిర్మిస్తున్నారు. 

డాక్టర్‌. జయంతిలాల్ గ‌డ‌ మాట్లాడుతూ, ``ఛత్రపతి` ఒక గొప్ప స్క్రిప్ట్. దాన్ని బాలీవుడ్‌కి తీసుకెళ్లడానికి మాకు ఓ స్టార్‌ కావాలి. అందుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పర్‌ఫెక్ట్ ఛాయిస్‌ అనిపించింది. రీమేక్‌లు తెరకెక్కించడంలో వి.వి.వినాయక్‌ కి మంచి పట్టుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ `ఛత్రపతి` రీమేక్‌ చేయడం ఆనందంగా ఉంది. ప్రీ  ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. బాలీవుడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి జ‌న‌రేష‌న్స్‌కి తగ్గట్టు స్టోరీలో కొన్ని మార్పులు చేస్తున్నాం` అని అన్నారు.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, `బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు `ఛత్రపతి` సరైనా ప్రాజెక్ట్ అనిపించింది. ఈ సినిమాలో నటించేందుకు ఆతృతగా ఉన్నాను. పెన్‌ స్టూడియోస్‌, డాక్టర్‌. జయంతిలాల్ గారి‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. న‌న్ను టాలీవుడ్‌లో హీరోగా ప‌రిచ‌యం చేసిన  వి.వి.వినాయక్ గారితో మ‌రోసారి క‌లిసి ప‌నిచేయ‌డం ఒక గొప్ప అవకాశం. ప్రభాస్ గారు ‌ పోషించిన పాత్రలో నటించడాన్ని ఓ గొప్ప బాధ్యతగా భావిస్తున్నా` అని తెలిపాడు. 

మాస్ డైరెక్ట‌ర్ వి.వి. వినాయ‌క్‌, మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న‌ ఈ రీమేక్ చిత్రం‌పై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.  ఈ ప్రాజెక్ట్‌కి సంబందించి ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. ఇదిలా ఉంటే బెల్లంకొండ నటించిన తెలుగు సినిమాలు హిందీలో డబ్‌ అయి మంచి రేటింగ్‌ని సంపాదిస్తున్నాయి. ఫస్ట్ మూవీ 'అల్లుడు శ్రీను' నుంచి 'రాక్షసుడు' వరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ప్రతి సినిమా  హిందీలో అనువాదమై  యూట్యూబ్ లో రికార్డ్ స్థాయి వ్యూస్ దక్కించుకుంటున్న నేపథ్యంలో పాపుల‌ర్ ఫిలిం మేక‌ర్ డా. జయంతిలాల్ గ‌డ‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని  బాలీవుడ్ లోకి గ్రాండ్ గా లాంచ్ చేస్తుండటం విశేషం.