గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం చాణక్య. తిరు ఈ చిత్రానికి దర్శకుడు. గోపీచంద్ నుంచి రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అక్టోబర్ 5న రిలీజ్ కు రెడీ అవుతోంది. గోపీచంద్ సరసన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. 

చాణక్య చిత్రం నుంచి తాజాగా ఓ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. గోపిచంద్ మెహ్రీన్ వెంటపడే టీజింగ్ సాంగ్ ఇది. ట్రెండీ మ్యూజిక్ తో ఈ పాట ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. 

విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. బేబీ గులాబీ అంటూ సాగే ఈ పాట హుషారెత్తించే విధంగా ఉంది. 'బాహుబలిలా కత్తి దూసి రాకలా రాకాసి పిల్ల' అంటూ రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు గమ్మత్తయిన లిరిక్స్ అందించారు. 

అనురాజ్ కులకర్ణి ఈ సాంగ్ ని మంచి జోష్ తో పాడాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. సైరా చిత్రం అక్టోబర్ 2న విద్దులవుతుండగా మూడు రోజుల గ్యాప్ లోనే చాణక్య చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. సైరా లాంటి భారీ చిత్రం విడుదలైన సమయంలో చాణక్యని విడుదల చేయాలనుకోవడం సాహసోపేత నిర్ణయమే.