ప్రముఖ బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు, రచయిత సాగర్‌ సర్హాది(87) కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. `నూరి`, `బజార్‌`, `కబీ కబీ`, `సిల్సిలా`, `చాందిని`, `దీవానా`, `కహో నా ప్యార్‌ హై` చిత్రాలకు పనిచేసి మంచి గుర్తింపుని, పేరుని తెచ్చుకున్నారు. ఉర్దూ నాటక రచయితగా ఇప్పటికీ చాలా మంది అభిమానిస్తారు. సాగర్‌ సర్హాది 1976లో హిట్‌ అయిన `కబీ కబీ` చిత్రానికి డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంతోనే ఆయన మంచి పేరొచ్చింది. అతను చేసిన కృషికిగానూ ఉత్తమ డైలాగ్‌ కేటగిరిలో ఫిల్మ్ ఫేర్‌ అవార్డుని అందుకున్నారు. 

`కబీ కబీ` చిత్రంలో అమిఆబ్‌ బచ్చన్‌, శశి కపూర్‌, రాఖీ, వహీదా రెహ్మాన్‌, రిషికపూర్‌, నీతూ సింగ్‌ నటించారు. దీనికి యశ్‌ చోప్రా దర్శకత్వం వహించడం విశేషం.  `కబీ కబీ` చిత్రం తర్వాత, సాగర్‌ సర్హాది `నూరి`, `చాందిని`, `సిల్సిలా` సినిమాలకు డైలాగ్స్ రాశారు. ఆయన పలు చిత్రాలను నిర్మించారు కూడా.  బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సాగర్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నటుడు జాకీ ష్రాఫ్‌ సంతాపం తెలియజేశారు. `మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం. మీ ఆత్మకి శాంతి చేకూరాలి సాగర్‌` అని సంతాపం తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోని పంచుకున్నారు.