బిగ్‌బాస్‌4 విన్నర్‌ అభిజిత్‌ తల్లికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని అభిజిత్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. కొద్దిగా లక్షణాలు ఉండటంతో మంగళవారం టెస్ట్ చేయించుకోగా, కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని చెప్పాడు. వాళ్లమ్మకి మాత్రమే కరోనా సోకిందని, మిగిలిన తామందరికి నెగటివ్‌ వచ్చిందని చెప్పాడు. ఆయన మాట్లాడుతూ, `ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. అమ్మకి పాజిటివ్‌అన్న విషయం మంగళవారం తెలిసింది. కుటుంబ సభ్యులమంతా పరీక్ష చేయించుకుంటే అందరికీ నెగటివ్‌ వచ్చింది. అమ్మకి సీటీ లెవల్స్ బాగానే ఉన్నాయి. ఇది కాస్త ఊరటనిచ్చే అంశం. ఆమె త్వరగా కోలుకుంటుందని భావిస్తున్నా` అని అన్నారు. 

ఇంకా చెబుతూ, `ఈ కోవిడ్‌ మానసిక ధైర్యానికి పరీక్ష పెడుతుంది. ఐసోలేషన్‌లో ఉండటం అనేది చెత్త విషయం. ఒక వ్యాధి సోకిన మనిషిని రూమ్‌లో బంధించడం చాలా దారుణం. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండండి. దురదృష్టవశాత్త్తూ మనం ఘోర పరిస్థితిలో ఉన్నాం. దీని గురించి ఇంకా మాట్లాడదల్చుకోలేదు. ఈ సమయాన్ని వేస్ట్ చేయకుండా ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు స్పానిష్‌ భాష నేర్చుకుంటున్నా` అని తెలిపాడు అభిజిత్‌. 

నాగార్జున హోస్ట్ గా గతేడాది ప్రసారమైన బిగ్‌బాస్‌4 సీజన్‌లో అభిజిత్‌ విన్నర్‌గా నిలిచాడు. అందుకుగానూ ఆయన 25 లక్షల ప్రైజ్‌మనీ, ట్రోపీని అందుకున్నారు. టాప్‌ 3లో ఉన్న సోహైల్‌ తనకు ఇచ్చిన 25లక్షల ఆఫర్‌ని తీసుకోవడంతో విన్నర్‌కి ఇవ్వాల్సిన మొత్తం ప్రైజ్‌మనీ 50లక్షల నుంచి 25లక్షలు తగ్గిపోయింది. ఈ షో తర్వాత అభిజిత్‌ సినిమా అవకాశాలు బాగా వస్తాయని భావించారు. కానీ ఇప్పటి వరకు ఆయన ఒక్క సినిమాని కూడా ప్రకటించకపోవడం గమనార్హం.