1996 లో వచ్చిన 'భారతీయుడు' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు శంకర్ క్రేజ్ బాగా పెరిగింది. కమల్ హాసన్ ని తెరపై చూపించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నారు.

'భారతీయుడు2' గా రాబోతున్న ఈ సినిమా నేటి నుండి షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ 'భారతీయుడు' సినిమా తీయడం వెనుకున్న కారణాన్ని వెల్లడించారు. శంకర్ చదువుకుంటున్న రోజుల్లో కాలేజ్ లో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తే అక్కడి యాజమాన్యం కుల, ఆదాయ సర్టిఫికేట్స్ కావాలని అడిగారట.

దీంతో శంకర్ తన తల్లితండ్రులతో కలిసి సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్లగా.. వారు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారట. ఆ సంఘటనే 'భారతీయుడు' సినిమాను  తెరకెక్కించేలా చేసిందని శంకర్ చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు రూపొందిస్తోన్న 'భారతీయుడు 2' సినిమాలో ప్రతీ సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన  కాజల్ హీరోయిన్ గా కనిపించనుంది. అనిరుద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ వంటి నటులు కనిపించబోతున్నట్లు సమాచారం.