బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేయడం కోసం మొదటి సినిమాకి దాదాపు రూ.40 కోట్లు ఖర్చు పెట్టి 'అల్లుడు శీను' అనే సినిమా తీశారు. డైరెక్టర్ వి.వి.వినాయక్, హీరోయిన్ గా సమంత, ఐటెం సాంగ్ కోసం తమన్నా ఇలా అన్ని ఆకర్షణలు యాడ్ అవ్వడంతో బెల్లంకొండ శ్రీనివాస్ కి గ్రాండ్ ఎంట్రీ లభించింది. ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చినా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవ్వడంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు.

అయినప్పటికీ బెల్లంకొండ సురేష్ తన కొడుకుని హీరోగా ప్రమోట్ చేసే విషయంలో ఖర్చు పరంగా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. శ్రీనివాస్ సినిమాలకు నిర్మాతగా తెరపై ఎవరి పేరు పడినా.. డబ్బు మొత్తం పెట్టేది మాత్రం సురేష్ బాబే... అయితే బెల్లంకొండ నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. ఫైనల్ గా ఇటీవల విడుదలైన 'రాక్షసుడు' సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ సక్సెస్ అందుకున్నాడు.

దీంతో ఇప్పుడు శ్రీనివాస్ తో సినిమాలు చేయడానికి బయట నిర్మాతలు ముందుకొస్తున్నారు. ఇక తన పెద్ద కొడుకుని బయట నిర్మాతలకు వదిలేసి రెండో కొడుకు బెల్లంకొండ గణేష్ ని హీరోగా దింపడానికి సిద్ధమవుతున్నాడు బెల్లంకొండ సురేష్. గతంలో కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన బెల్లకొండ గణేష్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.

అతని మొదటి సినిమాకి పవన్ సాధినేని దర్శకుడిగా వ్యవహరించనున్నారు. 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన పవన్ సాధినేని గత కొంతకాలంగా కళ్యాణ్ రామ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేశారు. కానీ అది వర్కవుట్ కాకపోవడంతో ఇప్పుడు బెల్లంకొండ గణేష్ తో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాను భారీ లెవెల్ లో  నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు బెల్లంకొండ సురేష్. మరి తన మొదటి సినిమాతోనే బెల్లం బాబు క్లిక్ అవుతాడేమో చూడాలి!