కరోనా వచ్చిన సెలబ్రెటీలు..  వాళ్లంతట వాళ్లే సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టి ...హాస్పటిల్ లో చేరటమో లేక స్వీయ క్వరైంటైన్ లోకి వెళ్లటమో చేస్తున్నారు. చాలామంది సినిమా వాళ్లకు కరోనా సోకుతున్న నేపధ్యంలో ఈ విషయాలు కామన్ అయ్యిపోయాయి. అయితే తాజాగా ఓ నటి ఆ పని చేయటానికి నిరాకరించటంతో సమస్య మొదలైంది. 

వివరాల్లోకి వెళితే..  తెలుగు సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రం అర్జున్‌ రెడ్డికి తమిళ రీమేక్ అయిన ఆదిత్య వర్మలో నటించిన బనితా సంధు కరోనా బారిన పడ్డారు. ఆమె  బ్రిటీష్‌ నటి.  షూటింగ్‌ కోసం భారత్‌కు వచ్చిన బనితా సంధు కరోనా రావటంతో కంగారుపడ్డారు.అయితే ఆమె పనిచేస్తున్న సినిమా టీమ్ .. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా రానంటూ మొండికేశారు. అంతేకాక అక్కడ నుంచి పరారయ్యేందుకు సైతం యత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమె పారిపోకుండా రక్షణ కల్పించారు. 

  కవితా తెరెసా సినిమా షూటింగ్‌ కోసం హీరోయిన్‌ బనితా సంధు డిసెంబర్‌ 20న కోల్‌కతాకు వచ్చారు. అయితే ఆ విమానంలోని ఓ ప్రయాణికుడికి కరోనా కొత్త స్ట్రెయిన్‌ సోకినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులతో పాటు సదరు నటికి సైతం పరీక్షలు నిర్వహించారు.  

ఈ క్రమంలో సోమవారం నాడు బనితాకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. అయితే అది కొత్త స్ట్రెయినా, లేదా సాధారణ కరోనానా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇక యూకే నుంచి వస్తున్నవారిలో పాజిటివ్‌ అని తేలిన వారిని బెలియాఘట ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా... బబితాను కూడా అక్కడికే పంపించారు. కానీ ఆమె ఆ ఆస్పత్రికి వెళ్లనని మొండికేస్తూ అంబులెన్స్‌ దిగడానికి నిరాకరించింది.

 ఓవైపు సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుంటే ఆమె అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అంబులెన్స్‌ చుట్టూ కవచంలా నిలబడి ఆమె పారిపోకుండా అడ్డుకున్నారు. అనంతరం ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా బనితా సంధు.. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన 'అక్టోబర్'‌ చిత్రంతో వెండితెరపై తెరంగ్రేటం చేశారు. ఆదిత్య వర్మ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకున్నారు.