కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ ఆ తరువాత నిర్మాతగా మారి సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. నటుడిగా, నిర్మాతగా పలు సినిమాలు చేసిన ఆయన ఆ తరువాత రాజకీయాల్లో కూడా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. కానీ అక్కడ అదృష్టం కలిసిరాక మళ్లీ నటన మీద దృష్టి పెట్టాడు.

ప్రస్తుతం మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో కమెడియన్ గా నటిస్తున్నాడు బండ్ల గణేష్. ఇటీవల ఈ సినిమాలో గణేష్ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నటుడిగా కొనసాగుతూనే మరోపక్క నిర్మాణ రంగంవైపు చూస్తున్నాడు బండ్ల గణేష్.

గతంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో `గోవిందుడు అందరి వాడేలే` సినిమాను నిర్మించాడు బండ్ల గణేష్. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నా హిట్ టాక్‌ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. అయితే ఇప్పుడు మరోసారి తనకు నిర్మాతగా అవకాశం ఇవ్వాలని లిటిల్ బాస్ అదేనండీ బిగ్ బాస్ చిరంజీవి కొడుకురామ్ చరణ్ ని కోరుతున్నాడు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. 'మళ్లీ మీ తో ఓ సినిమా తీసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రజల ముందు ఉంచాలని ఆ అవకాశం లిటిల్ బాస్ నాకు త్వరగా ఇవ్వాలని కోరుకుంటూ మీ బండ్ల గణేష్'. మరి అతడి కోరికను రామ్ చరణ్ తీరుస్తాడో లేదో చూడాలి. ఇక ఈరోజు విడుదలైన 'సైరా' సినిమాపై స్పందించిన బండ్ల గణేష్.. అన్నకు పాదాభివందనాలు అంటూ చిరంజీవిని ఆకాశానికెత్తేశారు.