Balagam Movie Review: `బలగం` మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఫక్తు తెలంగాణ కల్చర్ ని ఆవిష్కరించేలా తక్కువ సినిమాలొచ్చాయి. `ఫిదా`, `లవ్ స్టోరీ` వంటి కొన్ని చిత్రాల్లో కొంత టచ్ చేశారు. కమర్షియల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. కానీ మొదటిసారి ఓ పూర్తి స్థాయి తెలంగాణ గ్రామీణ సంస్కృతి, యాస, కట్టుబట్ట, కట్టుబాట్లని ఆవిష్కరిస్తూ వచ్చిన చిత్రం `బలగం`(Balagam). హాస్య నటుడు వేణు ఎల్దండి(టిల్లు)(Venu Tillu) దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రమిది. ఈ నెల(మార్చి)3న విడుదల కానుంది. ముందుగానే మీడియాకి ప్రీమియర్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూ(Balagam Movie Review)లో తెలుసుకుందాం.
తెలంగాణ కల్చర్‌పై వచ్చిన సినిమాలు చాలా అరుదు. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. తెలుగు సినిమా తెరపై ఒకప్పుడు అవమానానికి, అణచివేతకు గురైన తెలంగాణ భాష ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు విలన్లకి పరిమితం చేసిన తెలంగాణ భాష ఇప్పుడు హీరోయిజాన్ని అద్దుకుని టాలీవుడ్‌ని శాషిస్తుంది. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు తెలంగాణ కల్చర్‌తో, తెలంగాణ భాషలో, తెలంగాణ యాసలో మాట్లాడుతూ, తెలంగాణ కథలతో సినిమాలు చేస్తున్నారు, విజయాలు అందుకుంటున్నారు. తెలుగు తెరపై `తెలంగాణ` ఇప్పుడు సక్సెస్ ఫార్ములా మారింది.
ఫక్తు తెలంగాణ కల్చర్ ని ఆవిష్కరించేలా తక్కువ సినిమాలొచ్చాయి. `ఫిదా`, `లవ్ స్టోరీ` వంటి కొన్ని చిత్రాల్లో కొంత టచ్ చేశారు. కమర్షియల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. కానీ మొదటిసారి ఓ పూర్తి స్థాయి తెలంగాణ గ్రామీణ సంస్కృతి, యాస, కట్టుబట్ట, కట్టుబాట్లని ఆవిష్కరిస్తూ వచ్చిన చిత్రం `బలగం`(Balagam). హాస్య నటుడు వేణు ఎల్దండి(టిల్లు)(Venu Tillu) దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రమిది. ప్రియదర్శి(priyadarshi), కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు(Dil Raju) ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి వారసులు హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం ఈ నెల(మార్చి)3న విడుదల కానుంది. ముందుగానే మీడియాకి ప్రీమియర్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూ(Balagam Movie Review)లో తెలుసుకుందాం.
కథః
తెలంగాణ పల్లెటూరిలో జరిగే కథ. ఇంకా చెప్పాలంటే ఓ కాకి కథ. కొమురయ్య(సుధాకర్ రెడ్డి) తాత.. ఊర్లో అందరితో కలివిడిగా ఉంటాడు. ఆడాళ్లతో జోకులేస్తూ సరదాగా ఉంటాడు. కనిపించిన ప్రతి ఒక్కరిని మందలిస్తూ వారిని ఆటపట్టిస్తుంటాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక్క ఆడవిడ్డ. బలగం పెద్దదే అయినా ఇంట్లో ఉండేది ఒక్క కొడుకే, అందరిని సరదాగా నవ్విస్తూ, ఆటపట్టించే ఆయనలో ఏదో ఒక బాధ వెంటాడుతుంది. రెండు రోజుల్లో మనవుడు సాయిలు(ప్రియదర్శి) వరపూజ ఉంటుంది. ఆ కార్యం కోసం పొద్దుగాళ్ల బాయిదాక పోయిచ్చిన ఆయన మధ్యాహ్నానికి ఊర్లో ఉన్న టైలర్ (వేణు టిల్లు) వద్దకెళ్లి కొత్త బట్టలు కుట్టించుకుంటాడు. అక్కడ్నుంచి ఇంటికొచ్చి బోసిపోయిన ఇళ్లుని చూసి చింతిస్తాడు.
కట్ చేస్తే పెద్ద పట్నంలో సాయిలు(ప్రియదర్శి) ఏదో వ్యాపారాలు చేయాలని చెప్పి ఊర్లో ఎకరం భూమి అమ్ముకుని వస్తాడు. చిట్టీల వ్యాపారం చేస్తుంటాడు. దీంతోపాటు రకరకాల బిజినెస్‌లు పెట్టి లాసై లక్షల్లో అప్పు చేస్తాడు. అప్పులోడు మీదపడుతుంటాడు. అవి తాళలేక 15లక్షల కట్నానికి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతాడు సాయిలు. రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉంది, అది కాగానే అప్పు తీరుస్తానని తప్పించుకుంటూ వస్తుంటాడు. ఇంతలో తాత కొమురయ్య చచ్చిపోయిండని పిడుగులాంటి వార్త వస్తుంది. తన పెళ్లి ప్లాన్ అంతా రివర్స్ అయ్యిందని బాధపడుతుంటాడు. తాత చచ్చిండనే బాధ కంటే పెళ్లి అవుతుందో కాదు, అప్పు ఎలా తీర్చాలనే బాధలోనే ఉంటాడు. ఇంట్లో జరిగిన గొడవలో కాబోయే సంబంధం చెడిపోతుంది. మూడొద్దుల రోజునాడు కాకి ముద్ద ముట్టదు, దీంతో అందరిలోనూ చింత. అదే సమయంలో సాయిలు తండ్రి(జయరాం)కి, మామయ్య(మురళీధర్)కి మధ్య గొడవలని తెలుస్తుంది. వారిద్దరు తరుచూ గొడవపడుతుంటారు. తన పెళ్లి సంబంధం చెడిపోవడంతో ఇంటికొచ్చిన మరదల్ని చూసి డబ్బు కోసం ఆమెని ఇష్టపడుతుంటాడు సాయిలు. ఎలాగైనా వారిని కలపాలనుకుంటాడు. మరి సాయిలు ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? ఇంతకి నాన్న, మామల మధ్య గొడవేంటి? కుటుంబంలో ఉన్న గొడవలేంటి? కాకి ఎందుకు ముట్టలేదు? కొమురయ్య మనసులో ఏముంది? సాయిలులో వచ్చిన మార్పేంటి? అనేది `బలగం` మిగిలిన కథ.
విశ్లేషణః
తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఫక్తు తెలంగాణ మూవీ ఇది. `కాకి` చుట్టూ అల్లుకున్న కథ. కాకీ చాటున మానవీయ విలువలను, కుటుంబ అనుబంధాలను, మానవత్వపు మమకారాన్ని కలగలిపి తెలంగాణ పల్లె జీవితాన్ని ఆవిష్కరించిన కథ `బలగం`. ఏ సినిమాకైనా ఎమోషన్ ముఖ్యం. అది పండితే అది ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. దానికి భాషభేదం ఉండదు. ఆ భావోద్వేగాలు కనెక్ట్ అయితే ఆ కథతో ట్రావెల్ చేస్తాడు ఆడియెన్. దానితో మమేకమై వెండితెరపై జరిగే అనుభూతులను తాను పొందుతుంటాడు. సినిమాలో తనే జీవిస్తాడు. అలాంటి భావోద్వేగాల సమాహారంగా `బలగం` చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించాడు దర్శకుడు వేణు. ఇన్నాళ్లు దాయబడ్డ తెలంగాణని పెద్ద తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో కథే హీరో, కాకినే హీరోయిన్. కాకీనే సినిమాని నడిపిస్తుంది. మనుషుల్లో ఉన్న స్వార్థాలను బయటపెడుతుంది, చిన్న గాలికే చెదిరిపోయే మానవ సంబంధాలను ప్రశ్నిస్తుంది. అంతేకాదు సినిమాలో మనమే ఉన్నట్టు, మన చుట్టూతే సినిమా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంతటి సహజంగా, అంతటి భావోద్వేగంతో, అంతటి ఫన్‌తో ఈ సినిమాని రూపొందించాడు దర్శకుడు వేణు. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది.
తాత కొమురయ్య పాత్ర పరిచయంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆయన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. కానీ అతనేంటనేది, అతను కోరుకుంటుందేంటి? అనేది బలంగా ఆవిష్కరించలేకపోయాడు. అయితే ఓ వైపు తాత చనిపోయాడనే విషాదం ఉన్నా, దాన్ని ఫన్నీ వేలో చూపించిన తీరు బాగుంది. ఊర్లల్లో వ్యక్తి చనిపోతే ఇరుగుపొరుగు ఆడలక్కలు ఏడుపులు, కూల్ డ్రింక్‌ల కోసం చేసే ఓవర్ యాక్టింగ్ ని ఫన్నీ వేలో చూపించడం నవ్వులు పూయిస్తుంది. మరోవైపు తాత చచ్చిపోయిండన్న బాధ లేకుండా కాబోయే భార్యని ప్రియదర్శి సైగలతో మ్యానేజ్ చేసే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. మందు కోసం, ముక్క కోసం ఇరుగు పొరుగు వాళ్లు ఎదురుచూడటం వంటి సన్నివేశాలు కామెడీగా లైటర్ వేలో చూపించారు. ఓ వైపు అంతర్లీనంగా ఎమోషన్స్ ని పండిస్తూనే పైకి ఫన్‌ని షుగర్ కోట్‌లా వేశాడు దర్శకుడు. ఈ విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు, రెండింటి మధ్య ఉన్న సన్నని గీతని మెయింటేన్ చేసిన తీరు బాగుంది. కొన్నిసార్లు గుండెబరువెక్కుతుంది, కొన్ని సార్లు రిలీఫ్‌నిస్తుంది. ఆ రెండింటి మధ్య ఆడియెన్ ట్రావెల్ అవుతుంటాడు.
అయితే సినిమా కొంత స్లోగా నడుస్తుంది. ఫస్టాప్ మొత్తం పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడం, కొమురయ్య మరణంపైనే సాగుతుంది. కథ ఎంతకు ముందుకు సాగదు.తెలంగాణ గ్రామీణ కల్చర్‌లోని మరీ డీటెయిల్‌లోకి వెళ్లడంతో ఓవర్ డోస్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అంతగా చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కాకీ ముద్ద ముట్టడానికి సంబంధించిన సన్నివేశాల సాగతీత కూడా కొంత బోర్ ఫీలింగ్ తెప్పిస్తుంది. ఇందులో కొన్ని సన్నివేశాలు సిల్లీగానూ అనిపిస్తాయి. అయితే క్లైమాక్స్ సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుంది. 11రోజుల కార్యక్రమం(పెద్ద కర్మ) రోజు కుటుంబంలోని చిన్న చిన్న మనస్పర్థాలను, కలహాలను, మనసులో దాగున్న బాధలను బయటపెడుతూ బుర్రకథ చెప్పిన తీరు బాగుండటమే కాదు, సినిమాకి అదే ఆయువు పట్టుగా ఉంటుంది. అది కుటుంబ సభ్యులను కదిలించి వారిలో మార్పు తేవడమేకాదు, థియేటర్లలో కూర్చొన్న ఆడియెన్‌ని కూడా కదిలిస్తుంది. గుండెబరువెక్కిస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది. అయితే అందులోనూ ఓవర్ డోస్‌గా అనిపిస్తుంది. దాన్ని కొంచెం తగ్గిస్తే బాగుండేది.
సినిమాలో ఫన్ ఉన్నా, చాలా వరకు ఓ ఆర్ట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఇతరులకు ఎంత మేరకు కనెక్ట్ అవుతుందనేది ప్రశ్న. ఎమోషన్ కనెక్ట్ అయితే ఇతరులు కూడా సినిమాతో ట్రావెల్ చేస్తారు, కానీ అంత ఓపికగా చూడగలరా అనేది సమస్య. సినిమాని ముందుగానే ప్రిమియర్ షోస్ వేసి ఈ కాన్సెప్ట్ ని జనాల్లోకి తీసుకెళ్తే బాగుండేది. ప్రమోషన్స్ విషయంలో టీమ్ లైట్ తీసుకోవడమే ఈ సినిమాకి పెద్ద మైనస్. అది ఓ రకంగా సినిమాని కిల్ చేసుకోవడమే అవుతుంది. `రైటర్ పద్మభూషణ్` లాంటి సినిమా ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించడం ద్వారా అది ఆడియెన్స్ లోకి వెళ్లింది. ఆదరణకు గురయ్యింది. `బలగం` టీమ్ కూడా అలా చేస్తే కచ్చితంగా సక్సెస్ అయ్యే సినిమా. చిత్ర బృందమే ఈ సినిమాని తొక్కేసుకున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నటీనటులుః
సాయిలు పాత్రలో ప్రియదర్శి చాలా బాగా చేశాడు. పెళ్ళి కోసం, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటప్పుడు, మరదల్ని లైన్‌లో పెట్టే సన్నివేశాల్లో బాగా చేశాడు. నవ్వులు పూయించాడు. అతని పాత్రలో కామెడీ, ఎమోషన్, బాధ్యత కనిపిస్తుంటాయి. ఇక ప్రియదర్శి మరదలిగా చేసిన కావ్యా కళ్యాణ్ రామ్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. కొమురయ్యగా సుధాకర్‌రెడ్డి కాసేపే అయినా అలరించారు. మామగా మురళీధర్, తండ్రిగా జయరాం అద్బుతంగా చేశారు. రచ్చ రవి కామెడీ అలరిస్తుంది. సీరియస్ గా సాగే కథకి రిలీఫ్ నిస్తుంది. కొమురయ్య నాకేం చెప్పాలే, నేనేం వినలే అంటూ అలరించాడు. రూప లక్ష్మి, విజయలక్ష్మి, వేణు పాత్రలు సైతం ఆకట్టుకుంటాయి. సినిమాలో ప్రతి పాత్ర అలరిస్తుంది. పర్‌ఫెక్ట్ మ్యాచ్ అయ్యింది. ఆయా పాత్రల్లో వారిని తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేం అనేంతగా సెట్ కావడం విశేషం.
టెక్నీషియన్లుః
కాసర్ల శ్యామ్ పాటలు బాగున్నాయి. తెలంగాణ పల్లెని గుర్తు చేసేలా ఉన్నాయి. హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం, బీజీఎం సినిమాకి ఆయువుపట్టు. పాటలే సినిమాకి కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తాయి. ఆచార్య వేణు కెమెరా వర్క్ బాగుంది. తెలంగాణని, కల్చర్‌ని, అందులోని ప్రతి మూవ్‌మెంట్‌ని స్పష్టంగా చూపించారు. చాలా చోట్ల కెమెరానే మాట్లాడుతుంది. కెమెరానే కథ చెబుతుంది. ఎడిటింగ్ పరంగా కొంత కేర్ తీసుకోవాల్సింది. ఇక దర్శకుడు వేణు ఎల్దండి దర్శకుడిగా తొలి ప్రయత్నం సక్సెస్ అయ్యాడు. `బలగం` ఓ జెన్యూన్, సన్నియర్ అటెప్ట్. ఆ విషయంలో ఆయన్ని అభినందించాల్సిందే. భావోద్వేగాలు, కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణని, గొడవలను ఆవిష్కరించిన తీరు అద్భుతం. కానీ కథ పరంగా మరింత కేర్ తీసుకుని, కొంత కమర్షియాలిటీ యాడ్ చేస్తే సినిమా ఫలితం కమర్షియల్‌గానూ బాగుండేది. ఈ సినిమా కమర్షియల్‌గా ఆకట్టుకోవడం కష్టం, కానీ తెలంగాణ బిడ్డల ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది. వారికి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఇప్పటికీ ఇలాంటి కల్చర్ తెలంగాణ పల్లెల్లో ఉండటంతో చాలా వరకు కనెక్ట్ అవుతుంది.
ఫైనల్‌గాః అసలు సిసలైన తెలంగాణ పల్లె జీవితాన్ని ఆవిష్కరించిన మూవీ. కాకి చుట్టు అల్లుకున్న మానవ సంబంధాలను, కుటుంబ అనుబంధాల గొప్పతనాన్ని ఆవిష్కరించిన సినిమా. ఫన్ అండ్ ఎమోషనల్ డ్రైవ్.
రేటింగ్‌ః 3
నటీనటులు : ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు తదితరులు .
ఛాయాగ్రహణం : ఆచార్య వేణు
పాటలు : కాసర్ల శ్యామ్
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
సమర్పణ : శిరీష్
నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత
దర్శకత్వం : వేణు యెల్దండి (వేణు టిల్లు)
విడుదల తేదీ : మార్చి 3, 2023