బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటాడు. తన సినిమాలు సామాజిక సమస్యలపై స్పంధించటమే కాదు తన జీవితంలో జరిగిన సరదా సంఘటనలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంటాడు అమితాబ్. బుధవారం తన పెళ్లి రోజు సందర్భంగా తాను పెళ్లి చేసుకోవటం వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టాడు మెగాస్టార్‌. ఈ సందర్భంగా ఆ రోజు జరిగిన సంఘటనను తన సోషల్‌ మీడియా పేజ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

అమితాబ్ తన సహ నటి జయ బచ్చన్‌నే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో అభిమాన్‌, చుప్కే చుప్పే, సిల్‌ సిలా, మిలి, జంజీర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్ హిట్స్‌ వచ్చాయి. తెర మీద తనకు హిట్ జోడి అనిపించుకున్న అమితాబ్‌, జయాలు నిజ జీవితంలోనూ బెస్ట్ జోడి అనిపించుకున్నారు. ఈ రోజు అమితాబ్, జయాల 47వ మ్యారేజ్‌ డే సందర్భంగా తన పెళ్లికి ముందుకు జరిగిన పరిణామాలు వివరించాడు అమితాబ్‌.

అమితాబ్‌, జయాలు కలిసి నటించిన సూపర్‌ హిట్ సినిమా జంజీర్‌ రిలీజ్‌ తరువాత ఆ సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకునేందుకు జయతో పాటు మరికొందరు స్నేహితులతో కలిసి లండన్ వెళ్లాలనుకున్నాడు అమితాబ్‌. ఆ సమయంతో అమితాబ్ తండ్రి ఆయన్ను ఎవరితో కలిసి వెళ్తున్నావ్ అని అడిగారట. అయితే అప్పుడు అమితాబ్‌తో జయాతో కలిసి వెళుతున్నట్టుగా చెప్పగానే ఆమె పెళ్లి చేసుకొని అప్పుడు వెళ్లు, లేదంటూ వెళ్లకు అని చెప్పటంతో వెంటనే బిగ్ బీ జయాతో పెళ్లి రెడీ అయిపోయారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్‌ చేసుకున్న అమితాబ్, తమ పెళ్లి నాటి ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అమితాబ్‌, జయాలకు ఇద్దరు పిల్లలు అభిషేక్ బచ్చన్ హీరోగా బాలీవుడ్‌లో కొనసాగుతుండగా కూతురు శ్వేతా నంద వ్యాపార వేత్తగా సత్తా చాటుతోంది.