బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కరోనా విజృంభన నేపథ్యంలో భారీ విరాళం ప్రకటించారు. ఆయన రెండు కోట్ల సాయం అందించారు. రాకబ గంజ్‌ గురుద్వారాకి ఆయన ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఢిల్లీలోని రాకబ గంజ్‌ గురుద్వారని ఆ సంస్థ నిర్వహకులు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చారు. అందుకుగానూ అమితాబ్‌ రెండు కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీ సిక్కుల గురుద్వార మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు మంజిందర్‌ సింగ్‌ సిర్సా వెల్లడించారు. 

అమితాబ్‌ రెండు కోట్లు విరాళంగా ఇస్తూ, సిక్కులు గొప్పవాళ్లని, వారి సేవలకు సెల్యూట్‌ చేయాల్సిందేనని మెచ్చుకున్నాడని తెలిపారు. విదేశాల్లో నుంచి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను సైతం ఈ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు అమితాబ్‌ తెప్పించాడని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఫోన్‌ చేస్తూ పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుంటున్నాడని మంజిందర్‌ చెప్పుకొచ్చారు. గురుద్వారని కోవిడ్‌ సెంటర్‌గా నేటి(సోమవారం) నుంచి ప్రారంభించనున్నారు. ఇందులో 300బెడ్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు,  అంబులెన్సులతోపాటు కరోనా రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు, ఇతర సిబ్బంది కూడా అందుబాటులో ఉండనున్నారు. ఉచితంగా పేషెంట్లకి ఈ సౌకర్యాలు అందిస్తున్నారు. 

అమితాబ్‌ బచ్చన్‌ గతేడాది తెలుగు చిత్ర పరిశ్రమ సినీ వర్కర్ల కోసం 1.8కోట్లు విరాళం అందించారు. అలాగే దేశవ్యాప్తంగా లక్ష మంది సినీ కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు తనవంతు సాయాన్ని అందించారు. ఇదే కాకుండా రైతులకు, వీర సైనికులకు ఆయన విరాళం అందిస్తున్న విషయం తెలిసిందే.అమితాబ్‌ ఇటీవల చిరంజీవి `సైరా`చిత్రంలో నటించారు. త్వరలో ఆయన ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌  కాంబినేషన్‌లో రూపొందే చిత్రంలో నటించబోతున్నారు.